టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తూ మంగళవారం చేసిన ఓ చిన్న ట్వీట్ ఏకంగా మెగా ఫ్యామిలీలో పెద్ద చిచ్చునే రాజేసింది. ఈ చిచ్చు ఎక్కడిదాకా వెళ్లిందంటే… చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ స్వయంగా తన అన్నయ్య తీరును తప్పు పట్టేంతగా. అంతేనా… ఎప్పుడూ చిరును వేలెత్తి చూపని పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా మెగా స్టార్ ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేలా కూడా ఈ ట్వీట్ ఆరని మంటలనే రాజేసింది. మొత్తంగా ఈ అగ్గి ఎక్కడిదాకా వెళుతుందోనన్న వాదనలు పెను కలకలమే రేపుతున్నాయి. ఈ పరిణామం గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
జగన్ మెగా డ్రైవ్ పై చిరు ట్వీట్
ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తదనంతరం పలుమార్లు జగన్ ను ప్రస్తావిస్తూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సతీసమేతంగా అమరావతి వెళ్లి మరీ జగన్ ను అభినందించి వచ్చారు. ఆ తర్వాత కూడా జగన్ పై చిరు పలుమార్లు కామెంట్లు చేశారు. అవన్నీ జగన్ ను కీర్తించేలానే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా జగన్ ను అకాశానికెత్తేస్తూ చిరు ఓ ట్వీట్ పెట్టారు. **ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఓ గొప్ప కార్యం.. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కొవిడ్ భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. శ్రీ జగన్ గారిది స్ఫూర్తిదాయక నాయకత్వం.. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానుస** అని సదరు ట్వీట్ లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్నయ్య అలా చేసి ఉండాల్సింది కాదు
ఈ ట్వీట్ ను చూసిన వెంటనే పవన్ కల్యాణ్ శిబిరంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనట్లు సమాచారం. జగన్ సర్కారు తీరుపై ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో జగన్ ను స్మరిస్తూ చిరు ట్వీట్ ఎంతవరకు సబబు? అన్న దిశగా పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ తీరు ఇలా ఉంటే.. మరో అడుగు ముందుకేసిన పవన్ ఏకంగా చిరంజీవి తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. *అన్నయ్య ఇలా ట్వీట్ చేసి ఉండాల్సింది కాదు* అని పవన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. ఈ కామెంట్ తెలిసినంతనే… పీకే ఫ్యాన్స్ చిరుపై మరింత ఘాటు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.
జాబ్ చార్ట్ పై నిరుద్యోగుల ఫైర్
ఇలా చిరుపై పీకే, ఆయన ఫ్యాన్స్ ఇంతలా మండిపడేందుకు ఓ కారణం కూడా ఉంది. మూడు రోజుల క్రితం ఏపీలో జాబ్ చార్ట్ పేరిట ఉద్యోగ నియామకాల కేలండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉంటే… కేవలం వేలల్లోనే పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా జగన్ సర్కారు విడుదల చేసిన చార్ట్ పై నిరుద్యోగ సంఘాలు ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సోవమారంనాడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరుద్యోగులు కదం తొక్కారు. కలెక్టరేట్లను ముట్టడించిన నిరుద్యోగులు… ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మొత్తంగా జగన్ సర్కారు విడుదల చేసిన జాబ్ చార్ట్ కారణంగా సోమవారం ఏపీలో భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి.
నిరుద్యోగులకు అండగా జనసేన
ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు బాసటగా నిలిచే దిశగా పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… పవన్ కల్యాణ్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే నిరుద్యోగులకు మద్దతుగా మంగళవారం నాడు వామపక్షాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపో,మాపో మనం కూడా నిరుద్యోగులకు అండగా బరిలోకి దిగుదామని పవన్ చెప్పారట. పవన్ ఈ దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో జగన్ సర్కారు చేపట్టిన మెగా డ్రైవ్ ను కీర్తిస్తూ ట్వీట్ చేయడం మెగా ఫ్యామిలీలో అగ్గి రాజేసిందని తెలుస్తోంది. నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అన్నయ్య… ఆ విషయాన్ని అసలు పట్టించుకోకుండా… జగన్ ను కీర్తిస్తూ ట్వీట్ చేయడమేంటని పవన్ ఓ రేంజిలో ఫైరైనట్లుగా తెలుస్తోంది.
నాగబాబు మద్దతు ఎవరికి?
చిరు వైఖరిపై పవన్ అభిప్రాయాన్ని తెలుసుకున్నంతనే… పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజిలో స్పందిస్తున్న వైనం కలకలం రేపుతోంది. నిరుద్యోగుల ఆవేదనకు మద్దతుగా చిరంజీవి నిలుస్తారనుకుంటే… జగన్ నామస్మరణలో ఆయన మునిగిన వైనంపై నిజంగానే అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ లో కొందరిని ఆశ్చర్యానికి గురి చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… అన్నయ్య తీరుపై తమ్ముడి ఆగ్రహం నేపథ్యంలో మరో మెగా బ్రదర్ నాగబాబు ఎవరి పక్షాన నిలుస్తారన్న విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- కమల దళం ఓటు బ్యాంకు వ్యూహం.. పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి పదవి?