దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.దేశ వ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు యోగి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని అప్పుడప్పుడు చెబుతుంటారు.ఇక మహారాష్ట్రలో కొవిడ్ కేసులు ఎక్కువైన సందర్భంలోనూ బీజేపీ నాయకులు అలాంటి ప్రకటనలే చేశారు.అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు యూపీలో కరోనా నియంత్రణ చర్యలు ఎలా ఉన్నాయనేందుకు నిదర్శంగా మారాయి.యూపీలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను దేవుడే కాపాడాలి అనే విధంగా అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు,ప్రభుత్వ కార్యాచరణపై హైకోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది.
సంతోష్ కుమార్ మృతిపై..
మీరట్‌కు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి కొవిడ్‌తో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.ఓ రోజు రాత్రి రెస్ట్ రూంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు.తరవాత చికిత్స అందించినా చనిపోయాడు.అయితే సంతోష్ కుమార్ విషయంలో ప్రభుత్వ రికార్డుల్లో గుర్తు తెలియని మరణంగా నమోదు చేయడంతో పాటు ఆసుపత్రి నుంచి అదృశ్యమైనట్లు రాశారు. దీనికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ప్రభుత్వం కొవిడ్ మరణాలను దాచిపెడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.ఈ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆసుపత్రి యంత్రాంగం తీరును తప్పుపట్టడంతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్నవారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా వ్యాఖ్యానించింది.
Must Read ;- NHRC : కరోనా మృతులను గౌరవంగా సాగనంపండి

వైద్యసదుపాయాలపై నిలదీత..
ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్రంలో వైద్యసదుపాయాలు,చికిత్సలపై ప్రభుత్వాన్ని నిలదీసింది.సాధారణ సమయాల్లోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉంటున్ననేపథ్యంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజానీకాన్ని దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించింది.కొన్ని ప్రాంతాలను ఉదాహరణగా ప్రస్తావించింది.బిజినోర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని,ప్రతి మూడు లక్షల మందికి 30 పడకలు సరిపోతాయా అని ప్రశ్నించింది.కేవలం బెడ్లు మాత్రమే ఉంటే సరిపోదని,ఆక్సిజన్ లభ్యత,సిబ్బంది వివరాలు కూడా అందుబాటులో లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది.అదే సమయంలో దేశ రాజధాని దిల్లీకి కూతవేటు దూరంలోని ఉత్తరప్రదేశ్‌లోని బాసీ గ్రామ పరిస్థితి కూడా తెరపైకి వచ్చింది.గ్రామ జనాభాలో మూడోవంతు మంది కొవిడ్ బారిన పడడం,ఒకే ఊరిలో 30 మంది చనిపోయిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే యూపీలోని పలు ప్రాంతాలు,నదుల్లో మృతదేహాలు బయటపడుతున్న ఘటనలపై వార్తలు వస్తున్నాయి.పవిత్ర గంగానదిలో కొవిడ్ అనుమానితుల మృత దేహాలు వెలుగుచూడటంతో దేశమంతా ఉలిక్కి పడింది.యూపీలో ఇప్పటి వరకు 17,871 మంది అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్‌తో మరణించగా అనధికారికంగా చాలా మరణాలు ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల మృతి
కొవిడ్ కారణంగా యూపీలో ఇప్పటి వరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు చనిపోయారు.గతంలో నలుగురు చనిపోగా ఇటీవల యూపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ కొరి లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిపోయారు. బీఎస్పీ,ఎస్పీకి చెందిన నేతలు కూడా ఇదే విధంగా చనిపోయారు.
Also Read ;- మీ ఆదర్శ రాజ్యంలో గంగ ఘోషను వింటున్నారా..? మోదీపై గుజరాతీ మహిళ కవితాస్త్రం











