(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం పట్టణానికి చేరువలో ఉన్న కనుగులవానిపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత,ఆ గ్రామ మాజీ సర్పంచ్ కనుగుల కృష్ణారావు (76)దారుణహత్యకు గురయ్యారు. పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకుంది.
మాటామాటా పెరిగి ..
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..కనుగులవానిపేటకు చెందిన కృష్ణారావు ఎప్పట్లాగే గురువారం వెంకటేశ్వర ఆలయ సమీపంలోని తన మామిడి తోటలో సేదతీరుతున్నారు.ఇంతలో అక్కడికి అదే గ్రామానికి చెందిన కనుగుల సవరరాజు చేరుకున్నాడు.ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ 40 ఏళ్ల కిందట జరిగిన పాత గొడవలపై మాటామాటా పెరిగింది.అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.ఇంతలో మద్యం మత్తులో ఉన్న సవరరాజు తన వెంట తెచ్చుకున్న కత్తితో కృష్ణారావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీకాకుళం గ్రామీణ సీఐ సి.అంబేడ్కర్, ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కృష్ణారావు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సర్పంచిగా, నీటి సంఘ అధ్యక్షునిగా, టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా పని చేశారు.
పాతకక్షలే : డీఎస్పీ
ఈ హత్య వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు.నిందితుడు కనుగుల సవరరాజు గతంలో సారా కాసే సమయంలో అప్పటి సర్పంచిగా ఉన్న కృష్ణారావు పోలీసులకు సమాచారమిచ్చి పట్టించారు.దీంతో సవరరాజుపై పోలీసు కేసులు నమోదయ్యాయి.వాటి కారణంగా 15 ఏళ్ల కిందట నరసన్నపేట మండలం నడగాంలో స్థిరపడ్డాడు.అక్కడికి వెళ్లిపోవడానికి కృష్ణారావే కారణమని భావించి అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామమైన కనుగులవానిపేటకు వచ్చి తనకున్న పొలం చూసుకుని మళ్లీ వెళ్లిపోతుండేవాడు. గురువారం మామిడి తోట వద్ద కృష్ణారావు,సవరరాజు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.అప్పటికే మద్యం మత్తులో ఉన్న సరవరాజు కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న కత్తితో కృష్ణారావు తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు డీఎస్పీ తెలిపారు.
పలువురి సంతాపం
టీడీపీ నాయకుడు కృష్ణారావు మృతి పట్ల ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు,మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి, మాజీ ఎంపీపీ గుండ జగన్నాథరావు తదితరులు సంతాపం తెలిపారు.











