తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి అనే మాటను ఈ మధ్య కాలంలో అందరి నోటా వింటున్నాం. ‘బాహుబలి’ సినిమా రికార్డులను తిరగ రాసిందని చంకలు గుద్దు కుంటున్నాం. వీటన్నిటినీ మించిన సినిమా ఒకటుందని ఎందరికి తెలుసు? అదే ‘కరుణామయుడు’ సినిమా.
ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని భాషల్లోకి అనువాదమైందో చెప్పాలంటే మన వల్ల కాదు. విజయచందర్ ఏసుక్రీస్తుగా నటించిన ఈ సినిమాని మించిన ఏసుక్రీస్తు కథావస్తువుగా తెరకెక్కిన సినిమా హాలీవుడ్ లోనే కాదు వేరే ఏ ఇతర భాషలోనూ తెరకెక్కలేదనే చెప్పవచ్చు. ఏసుక్రీస్తు ఎలా ఉంటాడో మనకు తెలియదు.. కానీ ఇలానే ఉంటాడని ఈ సినిమాలోని విజయచందర్ ని చూస్తే అనిపిస్తుంది. ఆయన మీద ఎవరి కరుణ ఉందో తెలియదుగానీ ఈ సినిమా తెరకెక్కిన విధానం మీద సినిమా తీస్తే అదే పెద్ద సినిమా అవుతుంది. ఆ ప్రయత్నం కూడా ఎవరైనా చేస్తారేమో.
50 ఏళ్లు వెనక్కి వెళితే..
1970లో ‘మరో ప్రపంచం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో ఓ చిన్న వేషం దొరికింది విజయ్ చందర్ కి. సినిమా నటుడు కావాలన్న తపన అతనిది. ఎలాగో ప్రయత్నిస్తే ఆ వేషం దొరికింది. అది చిన్న జర్నలిస్టు వేషం. గడ్డం ఉండటంతో అచ్చు ఏసుక్రీస్తులా ఉన్నావంటూ ఆ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కితాబు. తన గురించి ఏదేదో ఊహించుకుంటే ఇంకేదో తగలింది. హీరోలా ఉన్నావనకుండా ఏసుక్రీస్తులా ఉన్నాడంటా డేంటి అనుకున్నాడు విజయచందర్. తన ఫ్యామిలీ బ్యాగ్గ్రౌండే వేరు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడి వరసవుతాడు విజయచందర్.
చదువు పెద్దగా ఒంటబట్టలేదు.. ఎంతసేపూ ఆటపాటల్లోనే కాలక్షేపం. ఉద్యోగం పురుష లక్షణం అని అతను అనుకోలేదు. హీరోగా వెలిగిపోతే అంతే చాలనుకున్నాడు. దానికి కారణం ఉంది. అతని పిన్ని టంగుటూరి సూర్యకుమారి సినిమారంగంలో వెలిగిపోతోంది. డిగ్రీ పూర్తవగానే ఆమె దగ్గరికి చేరిపోయాడు. సినిమా రంగ ప్రవేశానికి గాడ్ మదర్ తోడు ఉంది కాబట్టి ఎలాగో వేషాలు దొరికాయి. కొన్ని అవకాశాలు చేజారినా ‘మరో ప్రపంచం’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో విలన్ పాత్రలు కూడా వచ్చి చేరాయి.
Must Read ;- గురు, శని కలయికే క్రిస్మస్ స్టారా?
మళ్లీ క్రీస్తు వచ్చి చేరాడు..
సినిమా జీవితం ఇలా గడిచిపోతున్న తరుణంలో తంగప్పన్ అనే నృత్యదర్శకుడు విజయ్ చందర్ ను కలిశాడు. తను దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్నానని, అందులో ఏసుక్రీస్తు పాత్రకు పనికొచ్చే నటుడి కోసం వెతుకుతున్నానని అన్నాడు. అది ‘అన్నా వేళాంగిణి’ అనే తమిళ సినిమా. ‘మీరైతే ఆ పాత్రకు సరిపోతారు చేస్తారా’ అనడిగాడు. మంచి పాత్రే చేద్దామనుకున్నా ఎందుకనో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అక్కడ కట్ చేసినా ఏసుక్రీస్తు పాత్ర ఆయన్ని వదల లేదు. మళ్లీ ‘రారాజు క్రీస్తు’ చేసే అవకాశం వచ్చింది.
1974 సెప్టెంబరు 2వ తేదీన సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. దానికి ఇద్దరు దర్శకులు. బి. కృష్ణమూర్తి, ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో దర్శకత్వం వహించే ఈ సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటలు, పాటలు రాయడం మరో విశేషం. బి. గోపాలం సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. హీరో కృష్ణ క్లాప్ కొట్టారు. హమ్మయ్య మంచి పాత్ర చేసే అవకాశం వచ్చిందన్న ఆనందంలో విజయచందర్ ఉన్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. విలేఖరుల సమావేశంలో తలా ఒక మాట మాట్లాడారు.
ఈ పాత్ర చేస్తే ఏదో ఒక ఆటంకం కలుగుతుందని భయపెట్టారు. ఎమ్జీఆర్ కూడా ఇలాంటి పాత్ర చేయాలనుకున్నా అది వర్కవుట్ కాలేదన్నారు. ఈ పాత్ర ఎవరైనా చేస్తే మరణిస్తారన్న ప్రచారం ఉందని కూడా భయపెట్టారు. హాలీవుడ్ సినిమా ‘టెన్ కమాండ్ మెంట్స్’లో క్రీస్తు మొహం చూపకపోవడానికి కారణం అదేనని కూడా చెప్పారు. విజయచందర్ మహా మొండిఘటం ఏదేమైనా ఈ పాత్ర చేసి తీరతానని అన్నారు. ఈ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాలు కూడా అంగీకరించేది లేదని కరాఖండీగా చెప్పేశారు.
సినిమా వదిలి వ్యాపారంలోకి..
వస్త్రాల ఎగుమతి వ్యాపారం విజయ్ చందర్ ను ఆకర్షించింది. చిట్టిబాబుకు అలాంటి కంపెనీలో వాటా ఉంది. తను కూడా ఆ వ్యాపారంలోకి దిగితే బాగుంటుందనుకున్నాడు. అలా ‘ల్యూమ్స్ ఇండియా ఫ్యాబ్రిక్స్’ కంపెనీ ప్రారంభించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం అనుకున్నాడు. నెలలు గడిచిపోతున్నాయి. వ్యాపారం జోరుగా సాగుతోంది. పైగా విదేశాల నుంచి నాలుగు లక్షల రూపాయల దుప్పట్లకు ఆర్డర్ వచ్చింది. అంతా సిద్ధమైన సమయంలో పిడుగులాంటి వార్త. ఆర్డర్ క్యాన్సిల్. ఆఫీసు అంతా దుప్పట్లే.. వాటిని ఏం చేయాలో పాలుపోలేదు. టైమ్ పాస్ కోసం ఆంధ్రాక్లబ్ కు వెళ్లడం.. అక్కడ పేకాట ఆడటం ఆయనకు అలవాటు. అలా టైమ్ గడిచిపోతోంది.
ఓ రోజు రాత్రి కలలో ఏసుక్రీస్తు కనిపించాడు. నా సినిమా ఎంతవరకు వచ్చింది? అని కలలో క్రీస్తు అడిగాడు. బహుశా తన సినిమా ఆలోచనలు మనసులో ఏదో మూలలో ఉండి కూడా ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు. తెల్లారి లేవగానే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేద్దామా? అనిపించింది. కొత్త సినిమా ఎందుకు ఆగిపోయిన సినిమానే మళ్లీ ప్రారంభిస్తే పోలా అనిపించింది. తన ఆలోచనను చిట్టిబాబుకూ, ఫాదర్ బాలగర్ కూ చెప్పారు. అంతా కలిసి క్రిస్టియన్ సెంటర్ లో ఉండే క్రిస్టఫర్ కోయిలోను కలిశారు. ఆయన సహకారంతో పరిశోధించి సరికొత్త కథను తయారు చేశారు. అదంతా తీస్తే దాదాపు 13 గంటల సినిమా అవుతుంది.
తగ్గించడం అసాధ్యం అనడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. చివరికి ఆ కథ రచయిత మోదుకూరి జాన్సన్ వద్దకు చేరింది. కుస్తీ పట్టి దాన్ని 3 గంటల సినిమాగా మార్చారు. మళ్లీ ప్రాజెక్ట్ స్టార్ట్. దర్శకుడిగా భీమ్ సింగ్ ను ఎంపిక చేశారు. ‘రారాజు క్రీస్తు’ ప్రాజెక్టుకు సమాంతరంగా ‘కరుణామయుడు’ తయారు కావడంతో వ్యతిరేకించే వారు తయారయ్యారు. వారంతా ‘రారాజు క్రీస్తు’కు పనిచేసిన వారే. ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది. కథ ఒకటే కాబట్టి ఛాంబర్ వారు కూడా ఒప్పుకోలేదు.. చివరికి ఎలాగో రాజీ చేశాక ‘కరుణామయుడు’ ప్రారంభమైంది. అందరినీ బతిమాలి తక్కువ పారితోషికంతో నటించటానికి ఒప్పించారు.
జగ్గయ్య, రాజసులోచన, రావు గోపాలరావు, పద్మనాభం, మిక్కిలినేని, గిరిబాబు, చంద్రమోహన్, శ్రీధర్, రామ్మోహన్, ధూళిపాళ, ముక్కామల, కాకరాల, ‘వెన్నిరాడై’ నిర్మల, జయమాలిని లాంటి తారాగణం సిద్దమైంది. ఇంకో పక్క విజయ్ చందర్ పై విమర్శలు.. బ్రాహ్మణుడు ఏసుక్రీస్తుగా నటించడం ఏమిటి లాంటి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. నిజానికి సినిమా తీసేంత డబ్బు విజయ్ చందర్ దగ్గర లేదు. ఉన్నదల్లా ఎక్స్ పోర్ట్ కావలసిన దుప్పట్లే. ఈ సినిమాకి ఈ దుప్పట్లు మాత్రం బాగా ఉపయోగ పడ్డాయి. వాటితో సినిమాకి కావలసిన కాస్ట్యూమ్స్ తయారుచేయించారు. ఫాదర్ బాలగర్ రూ. 4 లక్షల లోన్ ఇప్పించారు.
ఫ్రెండ్స్ దగ్గర లక్ష అప్పుతీసుకుని సినిమా మొదలెట్టేశారు. 1977 ఫిబ్రవరి 10 ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మూడో రోజే షూటింగుకు బ్రేక్. దానికి కారణం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ కన్నుమూత. మూడు రీళ్ల షూటింగ్ అయ్యేసరికి చేతిలో డబ్బంతా అయిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు విజయ్ చందర్ కి. ఎక్కడా అప్పు పుట్టలేదు.. ఫలితంగా షూటింగ్ ఆగిపోయింది. చేసేది లేక కూకట్ పల్లి సమీపంలోని 11 ఎకరాలను తాకట్టుపెట్టి 6 లక్షలు అప్పు తెచ్చారు.
అలా కొంతకాలం మళ్లీ షూటింగ్.. ఆ తర్వాత మళ్లీ బ్రేక్. తెలిసిన మొహం కనిపిస్తే చాలు అప్పుు అడిగేవాడు. దాంతో తెలిసిన వారు ఆయన కనపడగానే తప్పించుకునేవారు. ఒకాయన ఆరు లక్షలు అప్పు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ నమ్మకంతో లొకేషన్లు సిద్ధం చేసుకున్నారు విజయ్ చందర్. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో భైరవపాడు అనే పల్లెటూరును షూటింగుకు ఎంచుకున్నారు. ఊరంతా సెట్లు వేయించారు. డబ్బిస్తానని హామీ ఇచ్చిన ఆయన కనిపించలేదు. మళ్లీ బ్రేక్. సినిమా కష్టాలంటే ఎలా ఉంటాయో ఇహ చెప్పనక్కరలేదు. చేసేది లేక ఆంధ్రాక్లబ్ దారేది అని వెతుక్కున్నారు.
పేకాటే ప్రపంచంగా..
సినిమా తీయడమంటే ముళ్ల కిరీటం లాంటిదేనని విజయ్ చందర్ కు బోధ పడింది. హాయిగా పేకాడుకోకుండా ఎందుకొచ్చిన సినిమా కూడా అనిపించింది. పైగా ఆటలో ఆరితేరిన వ్యక్తి. ముక్కలు బాగా పడుతున్నాయి. షోల మీద షోలు తిప్పేస్తున్నాడు. డబ్బు కుప్పలా పోగు పడుతోంది. ఆ ఏసుక్రీస్తే తనతో ఆట ఆడిస్తున్నాడా అనిపించింది. ఆ డబ్బంతా పోగేసి ఓ వ్యక్తికి ఇచ్చి షూటింగ్ కు అవసరమైనవి కొనేయండి అంటూ ఆర్డర్ వేసేశాడు. రోజూ అదే పని. వరుసగా షోలు తిప్పేస్తుంటే అందరూ బెదిరిపోతున్నారు. దాదాపు 30 రోజులు ఆ పేకాట అలా కొనసాగింది. ప్రొడక్షన్ మేనేజర్ రావడం, డబ్బు పట్టుకెళ్లడం జరిగిపోతోంది.
రెండు వేలతో క్లబ్ లో అడుగుపెట్టి దాదాపు రూ. 10 లక్షలతో బయటికి వచ్చాడు. కొండంత ధైర్యం వచ్చింది. అంతే షూటింగ్ చకచకా జరిగిపోయింది. షూటింగ్ ఆగితే ఏంచేయాలో కూడా తెలిసిపోయింది. మధ్యలో భీమ్ సింగ్ కు పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన కన్నుమూశారు. ఆఖరి షెడ్యూల్ ను అసిస్టెంట్ డైరెక్టర్లతోనే తీయాల్సి వచ్చింది. మొత్తానికి ‘కరుణామయుడు’ పూర్తయింది. ఇక విడుదల చేయడమే తరువాయి. 115 రోజుల షూటింగ్.. ఖర్చు 29 లక్షలు. మొదటికాపీ వచ్చినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎన్ని ప్రివ్యూ షోలు వేసినా ఉపయోగం లేకపోయింది.
40కి పైగా ప్రివ్యూలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. తారకరామా ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత అనుమోలు జగన్మోహనరావు చివరికి ముందుకొచ్చారు. దాంతో మిగతా వారిలో చలనం వచ్చింది. రెండ్రోజుల్లో బిజినెస్ పూర్తయింది. దీంతోపాటు మలయాళ వెర్షన్ కూడా సిద్దం చేశారు. ఆ తర్వాత ఫైనాన్సర్ల కేసులు, కోర్టు డిస్మిస్ లు తర్వాత 1978 డిసెంబరు 21న సినిమా రిలీజ్. క్రిస్మస్ వెళ్లిపోయినా థియేటర్లలో జనం లేరు. ఆ తర్వాత జనం పెరుగుతున్నారు.
మరో రెండు రోజుల తర్వాత అన్ని ఆటలూ ఫుల్. కులమతాలతో సంబంధం లేకుండా జనం తాకిడి. ‘కదిలింది కరుణ రథం’ పాట వస్తే చాలు కన్నీళ్లతో బల్లలు తడిసిపోతున్నాయి.‘అమ్మలారా.. నా కోసం ఏడవకండి.. మీ కోసం.. మీ పిల్లల కోసం ఏడవండి’అనే డైలాగు వినగానే ప్రేక్షకుల్లో కన్నీటి వరదే. చివరికి 14 భాషల్లోకి అనువాదమైంది ఆ సినిమా. ఇది ఓ చరిత్ర.. అదే కరుణామయుడి చరిత్ర. ఇతర దేశాలకూ ఆయా భాషల్లో అనువాదమైంది. క్రిస్టియానిటీని తెలుగు వ్యాపింప చేయడానికి కారణమైన సినిమాగా కరుణామయుడునే చెప్పాల్సి ఉంటుంది.
– హేమసుందర్ పామర్తి