అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హిట్ ఇచ్చి చాలా కాలమే అయింది. ఆయన నుంచి వెంట వెంటనే సినిమాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆయన తన సమయాన్నంతా ‘మహాసముద్రం‘పైనే పెట్టాడు. ఇది మల్టీ స్టారర్ సినిమా కావడంతో ప్రధాన కథానాయకులను సెట్ చేయడానికే ఆయనకి చాలా సమయమే పట్టింది. అలా మొత్తానికి ఆయన శర్వానంద్ – సిద్ధార్థ్ లను ఒప్పించగలిగాడు. అనుకున్నట్టుగానే ఈ సినిమా షూటింగును పూర్తిచేయగలిగారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సమకూర్చిన ఈ పాట, ‘హే రంభా’ అంటూ సాగుతోంది. సీనియర్ హీరోయిన్ రంభ అభిమానులుగా జగపతిబాబు .. శర్వానంద్ బృందం పాడుకునే పాటగా దీనిని ఆవిష్కరించారు. సెక్సీగా కనిపించే రంభ కటౌట్లు చూపిస్తూ ఈ పాటను నడిపించారు. కథ .. పాత్రలను దృష్టిలో పెట్టుకుని భాస్కర భట్ల అందించిన సాహిత్యం బాగుంది. మొత్తానికి ఈ పాటతో మాస్ మనసులపై మసాలా చల్లారనే చెప్పుకోవాలి.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికలుగా అదితీరావు హైదరీ .. అనూ ఇమ్మాన్యుయేల్ కనువిందు చేయనున్నారు. కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. కొత్తదనంతో ఆయన చేస్తూ వస్తున్న ప్రయోగాలు విఫలమవుతూ వస్తున్నాయి. అందువలన ఆయన ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Must Read ;- సక్సెస్ కోసం శర్వా వెయిటింగ్!











