ఇవివి .. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టింది అందాల రంభ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న అమ్మడికి వరుస అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర కథా నాయకులందరితోనూ నటించే స్థాయికి చేరుకుంది. ఇటు అందం, అటు అభినయం కలబోసిన ఆ ముద్దుగుమ్మ.. పెళ్ళి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలాంటి రంభకి జగపతిబాబు అభిమాని అంటుంటే.. ఇదేదో నిజజీవితంలో అనుకునేరు.. లేదండీ.. సినిమాలోనే. అంటే రంభ రీ ఎంట్రీ ఇస్తోందని మళ్ళీ పొరపాటు పడొద్దు.
అసలు విషయమేంటంటే.. ప్రస్తుతం శర్వానంద్ , సిద్ధార్ధ హీరోలుగా నటిస్తోన్న ప్రేమ కథా చిత్రం మహాసముద్రం .. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో జగపతిబాబు కూడా ఓ ముఖ్య పాత్ర ను పోషిస్తున్నారు. ఇందులో జగపతి బాబు పాత్ర రంభని అభిమానిస్తుందట.
ప్రత్యేకంగా వేసిన సెట్లో జగపతి బాబు పై ఓ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో రంభ ఫోటోలు , ఫ్లెక్సీలు కనిపిస్తాయి. ఈ సాంగ్ చిత్రీకరించడానికి ముందు రంభ నుంచి నిర్మాతలు పర్మిషన్ కూడా తీసుకున్నారట. అప్పట్లో రంభ.. జగపతి బాబు ‘అల్లరి ప్రేమికుడు’ సినిమాలో ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Must Read ;- అందాల రత్తాలు నిశ్చితార్ధం ఖాయమైంది!