తనకు మాత్రమే సాధ్యమయ్యే విలక్షణమైన పాత్రల్లో మెప్పించే విశిష్ఠనటుడు రావు రమేశ్. తండ్రి రావుగోపాలరావు నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయనకి.. ఆయన స్వరం కూడా వచ్చి ఉంటే.. ఈ పాటికి ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేది. అలాంటి రమేశ్ .. తాజాగా ‘మహాసముద్రం’ సినిమాలో గూని వాడిపాత్ర పోషిస్తుండడం విశేషంగా మారింది. ఇందులో ఆయన పేరు బాబ్జీ. అందరూ గూని బాబ్జీ అని పిలుస్తుంటారు.
రావు రమేశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని మేకర్స్ .. ‘మహాసముద్రం’లోని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. టక్ చేసుకొన్న రావు రమేశ్ కోపంగా వెళుతున్న స్టిల్ కి మంచి స్పందన లభిస్తోంది. కుడి భుజాన్ని పైకి లేపి గూని వాడిలానే కనిపిస్తున్న ఆయనకి ‘మహాసముద్రం’లో ఈ పెక్యులర్ కేరక్టర్ ను డిజైన్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇలాంటి ఛాలెజింగ్ రోల్ కి రావు రమేశ్ నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనిపిస్తోంది.
శర్వానంద్, సిద్ధార్ధ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న మహాసముద్రం సినిమా .. మహా అనే ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ఓ వెరైటీ ప్రేమకథ. చిన్నతనం నుంచి శత్రువులు గా పెరిగిన శర్వా సిద్ధార్ద.. ఆ అమ్మాయి కోసం ఏం చేశారు అన్నదే ఈ సినిమా కథాంశం. వైజాగ్ బీచ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమకథ .. అజయ్ భూపతి తన స్టైల్లో హ్యాండిల్ చేస్తున్నాడు. ఇందులో మహా గా అదితీరావు హైదరి నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మరో కీలకపాత్రను జగపతి బాబు చేస్తున్నారు. మరి ఇందులో గూని బాబ్జీగా రావు రమేశ్ కు ఏ స్థాయిలో పేరు వస్తుందో చూడాలి.
Must Read ;- రంభ అభిమానిగా జగపతిబాబు.. నిజమేనా?











