వైసీపీకి చెందిన కీలక నేత, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ దేవదాయ శాఖలో నిత్యం వివాదాలే నడుస్తున్నాయి. దుర్గ గుడి నిర్వహణలో అక్రమాలు, ఆపై అక్కడ ఏసీబీ సోదాలు, ఏకంగా ఈవోపై బదిలీ వేటు, అంతకుముందు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో బయటపడ్డ అక్రమాలు.. తాజాగా మాన్సాస్ ట్రస్టు పరిధిలోని అప్పన్న ఆలయ పరిధిలో ఎప్పటికప్పుడు వెలుగు చూస్తున్న వివాదాలు.. ఇలా వెలంపల్లి ఆధ్వర్యంలోని దేవదాయ శాఖలో అక్రమాలకు కొదవే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ శాఖలోని విశాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన పుష్పవర్ధన్ ముఖంపై అక్కడే అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి ఏకంగా ఇసుక చల్లారు. ఈ వీడియో గురువారం నాడు తెగ వైరల్ అయిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ప్రభుత్వం ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేయగా.. దుర్గ గుడిలో అక్రమాలకు తెర తీసీన మాజీ ఈవో, ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిధి ఆర్జేడీగా పనిచేస్తున్న సురేశ్ బాబును విచారణాధికారిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈ ఘటన వెనుక పెద్ద తతంగమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పుష్పవర్ధన్ నేపథ్యం ఇదీ
డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ ఏపీ కేడర్ అధికారి కానే కాదట. తెలంగాణకు చెందిన ఆయనను ఏపీ ఇటీవలే డిప్యూటేషన్ పై విశాఖ దేవదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా నియమించింది. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తూ.. జగన్ సర్కారు ఇప్పుడు మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ దర్యాప్తు బాధ్యతలను కూడా ఇప్పుడు పుష్పవర్ధనే చూస్తున్నారట. అంటే.. మాన్సాస్ ట్రస్టులో అక్రమాల దర్యాప్తు బాధ్యతను చేపట్టేందుకు తెలంగాణకు చెందిన పుష్పవర్ధన్ ను ఏపీకి డిప్యూటేషన్ పై తీసుకువచ్చారన్న మాట. అంటే.. మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు లేకున్నా.. ఉన్నాయని చూపేందుకు తమ మాట మేరకు పనిచేసే అధికారి ఎవరన్న కోణంలో చూసిన జగన్ సర్కారు తెలంగాణ కేడర్ కు చెందిన పుష్పవర్ధన్ ను తీసుకొచ్చిందన్న మాట. తనను పిలిచి మరీ కీలక బాధ్యతలు అప్పగించిన జగన్ సర్కారు రుణం తీర్చుకోవాలంటే.. పుష్పవర్ధన్ మాన్సాస్ వ్యవహారాలను తిరగదోడాల్సిందే కదా. ఈ క్రమంలోనే ఆయన వచ్చిన నాటి నుంచి కింది స్థాయి అధికారులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారట. అందులో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ శాంతిపైనా ఆయన తన ప్రతాపం చూపారట. ఆ వేధింపులను తట్టుకోలేకే.. పుష్పవర్ధన్ పై శాంతి తనదైన నిరసన తెలిపేలా ఆయన ముఖంపై ఇసుక చల్లారని తెలుస్తోంది.
దొంగ చేతికి విచారణ బాధ్యతలా?
ఇక డీసీ ముఖంపై ఏసీ ఇసుక చల్లిన వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు.. ఆ దర్యాప్తు బాధ్యతలను దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా.. దుర్గ గుడి ఈవోగా వ్యవహరించిన సమయంలో అక్కడ అక్రమాలకు తెర తీసి అడ్డంగా బుక్కైన సురేశ్ బాబును నియమించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి చెప్పినట్టుగా నడుచుకుంటారన్న ఆరోపణలు ఉన్న సురేశ్ బాబును విచారణాధికారిగా నియమించిన నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతిదే తప్పన్నట్లుగా నివేదిక వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అదే సమయంలో జగన్ ఏరికోరి మాన్సాస్ లో అక్రమాలను వెలికితీసే బాధ్యతలు అప్పగించిన డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ కు ఈ వ్యవహారంలో క్లీన్ చిట్ కూడా దక్కడం ఖాయమన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం జగన్ సర్కారును ఇంకెంత మేర డ్యామేజీ చేస్తుందోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- అశోక్ మాట జగన్ వినాల్సిందే