ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏకాకిగా మారిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మొదలైన నాటి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడిచిన అనిల్.. పార్టీ విపక్షంలో ఉండగా.. జగన్ కు, పార్టీకి అండాదండాగా నిలిచారనే చెప్పాలి. మాటల్లో దూకుడు, చేతల్లో జెట్ స్పీడుగా కనిపించే అనిల్.. ఈ లక్షణాలతోనే జగన్ కోటరీలో ముఖ్యుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే జగన్ సీఎం కాగానే.. నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా అనిల్ కే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తనకు అత్యంత దగ్గరి వ్యక్తులుగా మారిన మేకపాటి ఫ్యామిటీ నుంచి గౌతం రెడ్డిని కూడా జగన్ తన కేబినెట్ లో చేర్చుకున్నారు. మొత్తంగా జిల్లాలో ఆనం, నల్లపురెడ్డి లాంటి సీనియర్లు ఉన్నా.. వారిని పక్కనపెట్టి మరీ ఇద్దరు కుర్ర నేతలకే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. తొలినాళ్లలో మంత్రి హోదాలో అనిల్ అందరితోనూ సఖ్యతగానే మెలిగారు. అయితే తర్వాతర్వాత ఆ సఖ్యత కాస్తా కనుమరుగు కాగా.. ఇప్పుడు ఒంటరివాడిగా మారిపోయిన అనిల్.. ఏకాకే అయిపోయారు.
సమస్యల పరిష్కారం చేతకాలేదు
జల వనరుల శాఖ మంత్రితో పాటు కర్నూలు జిల్లా ఇంచార్జీ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న అనిల్.. తొలుత బాగానే రాణించారనే చెప్పాలి. పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది గానీ.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాణించినవారే సమర్థులు కదా. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తలెత్తిన విభేదాలను పరిష్కరించే విషయంలో అనిల్ సక్పెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన తన జిల్లాలోని సమస్యల పరిష్కారంలోనూ సక్సెస్ కాలేదనే చెప్పాలి. వెరసి జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి దూరమైపోయిన అనిల్.. ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేకూ అనుకూలుడిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాత్రం చాలా సన్నిహితంగానే మెలగేవారు. అయితే అనిల్ వైఖరి నానాటికీ తీసికట్లుగా మారడంతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యం ఇవ్వని అనిల్ వ్యవహారంతో కోటంరెడ్డి కూడా ఆయనకు దూరమైపోయారట. ఇందుకు నిదర్శనంగా కోటంరెడ్డి నియోజకవర్గంలో ఏ పని జరిగినా.. అనిలే అన్నీ తానే వ్యవహరించగా.. ఇప్పుడు నెల్లూరు రూరల్ పరిధిలోని అభివృద్ధి పనులకు గౌతం రెడ్డి రిబ్బన్ ను కట్ చేస్తున్నారట.
అందరితోనూ దూరమే
ఇదిలా ఉంటే.. గురువారం నాడు పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి పరిధిలోని వెంకటాచలంలో పార్టీకి చెందిన కీలక నేత, ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అనిల్ ఆధ్వర్యంలోని జలవనరుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. అప్పటికే కాకాణితో అనిల్ కు పడదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలో తనకు తెలియకుండా పార్టీ ఎంపీపై కేసు ఎలా పెడతారంటూ కాకాణి అగ్గి ఫైరవుతున్నారు. మాగుంటపై కేసుతో కాకాణితో అనిల్ కు ఉన్న విభేదాలు కూడా ఒక్కసారిగా బట్టబయలయ్యారు. ఇక సీనియర్లైన తమను పక్కనపెట్టి కుర్రోడైన అనిల్ కు మంత్రి పదవి ఇస్తారా? అంటూ నల్లపురెడ్డితో పాటు కాకాణి కూడా ఎప్పటినుంచో ఇటు అనిల్ తో పాటు అటు జగన్ మీద కూడా గుర్రుగా ఉన్నారు. ఇక మాజీ మంత్రి అనం అయితే అనిల్ పేరు వింటేనే అంతెత్తున ఎగిరిపడుతున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఇక తనతో పాటు మంత్రిగా ఉన్న మేకపాటితో అనిల్ కు చాలా కాలం నుంచి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఇప్పుడు అనిల్ అందరు ఉన్నా ఏకాకిగా మిగిలిపోయారని చెప్పాలి.
Must Read ;-దేవినేనికి బెయిల్!.. జగన్ కు మరో షాకే కదా!