డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన తొలి రెండు సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే ఆ తర్వాత కథల ఎంపికలో సరైన జడ్జ్ మెంట్ లేకనో.. లేక సరైన దర్శకుడి చేతిలో పడకనో తెలియదు కానీ.. ఆది లాంటి టాలెండెట్ హీరో.. ఇప్పటికీ ఇంకా కెరీర్ లో సెటిల్ అవలేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడతడు ‘శశి’ అనే అందమైన ప్రేమకథా చిత్రంతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. శ్రీనివాస నాయుడు నడికట్ల అనే కొత్త దర్శకుడు మలిచిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘శశి’ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
‘మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’… అనే ఆది వాయిస్ మీద ట్రైలర్ ఓపెన్ అవుతుంది. వెంటనే హీరోయిన్ కు యాక్సిడెంట్ అయిన విజువల్స్ .. హాస్పిటల్ .. స్ట్రెచర్ మీద గాయాలతో హీరోయిన్ … అవుతుంది. ఆ తర్వాత ఆది ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతల్ని గెలవాలి… అంటూ సినిమా థీమ్ ను చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ సురభి ఎంట్రీ.. ఆమెతో ఆది ప్రేమలో పడడం… ఆ తర్వాత అతడి కేరక్టరైజేషన్ రివీలవుతుంది. మొత్తం మీద .. ఇందులో ఆది సాయికుమార్ రెండు షేడ్స్ కలిగిన పాత్రల్ని పోషిస్తున్నాడు. హీరోయిన్ ను అమితంగా ప్రేమించే వాడిగా.. ఆది పాత్ర కనిపిస్తుంది.
ఇంకా ఈ సినిమాలో జయప్రకాశ్, అజయ్, రాజీవ్ కనకాల, వైవా హర్ష లాంటి నటీనటులు కనిపిస్తున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం ఆకట్టుకుంటోంది. అలాగే.. అమర్ నాథ్ బొమ్మిరెడ్డి కెమేరా పనితనం కూడా బాగుంది. మొత్తం మీద ఆది సాయికుమార్ కి .. శశి సినిమాతో పెద్ద బ్రేకొస్తుందని ఆశిద్దాం.
Must Read ;- ‘ప్లే బ్యాక్’ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ అవుతాయి











