యాంకర్ గా సుమ చేతిలోకి మైక్ తీసుకుందీ అంటే, ఇక ఆమెకి ఎదురుగా నిలబడి తట్టుకోవడం కష్టం. సందర్భానికి తగినట్టుగా ఆమె మాటల గారడీ చేసేస్తుంది .. వినోదాల విన్యాసం చేసేస్తుంది. ఆమె మాటలకు అడ్డుకట్టవేయాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది .. ఆమె పైనే పంచ్ లు వేయడానికి చేసే ప్రయత్నాలు హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతాయి. సమయానికి తగినట్టుగా .. సందర్భానికి తగినట్టుగా .. సమయస్ఫూర్తితో ఆమె మాట్లాడే తీరు చాలా సందర్భాల్లో చాలామందినే ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఓ అభిమాని కూడా ఆమెపై చమత్కార బాణాన్ని ప్రయోగించబోయి, ఆమె ఇచ్చిన ఆన్సర్ కి అవాక్కయ్యాడు.
యాంకర్ గా .. హోస్ట్ గా ఎప్పుడు చూసినా ఎంతో బిజీగా ఉండే సుమ, ఇటీవలే ఓ యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఆమె తన ఛానల్ ను ప్రమోట్ చేసుకుంటోంది. ఈ విషయంలో ఒక వైపున రాజకీయ ప్రముఖులను .. మరో వైపున సినిమా ప్రముఖులను కూడా ఆమె వదలడం లేదు. సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే చాలావరకూ సఫలీకృతమయ్యాయి. సుమ కోసమే ఆయా ఛానల్స్ లోని కార్యక్రమాలను చూసే మహిళా ప్రేక్షకులు, ఆమె యూ ట్యూబ్ ఛానల్ పై కూడా ఒక కన్నేసే ఉంచారు. దాంతో యూ ట్యూబ్ ఛానల్ పరంగా కూడా సుమ దుమ్మురేపేస్తోంది.
సుమ చేస్తున్న యూ ట్యూబ్ వీడియోలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఓ యువకుడు, వరుసగా కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టాడు. అందరి కామెంట్స్ ను చూసినట్టుగానే సుమ అతని కామెంట్స్ ను కూడా చూసి ఊరుకునేది. దాంతో అతను ఎలాగైనా తన కామెంట్ కి సుమ స్పందించేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను తెలివిగా ఒక పనిచేశాడు. “సుమగారూ మీరు నాకు రిప్లై ఇవ్వరు .. కావాలంటే 1000 రూపాయలు పందెం” అంటూ కామెంట్ పెట్టాడు.
దీనికి సుమ నుంచి ఏదో ఒక రిప్లై వస్తుందని అతను ఆశించాడు. కానీ సుమ మాత్రం “నా అకౌంట్ నెంబర్ పంపిస్తున్నాను .. 1000 రూపాయలు అందులో జమ చేయండి” అంటూ కామెంట్ పెట్టింది. “నిజంగానే నేను మీకు రిప్లై ఇవ్వడం లేదు .. పందెం ప్రకారం ఆ డబ్బును నా అకౌంట్లో జమ చేయండి” అనే అర్థంతో సుమ పెట్టిన కామెంట్ కి అతను నివ్వెరపోయి .. నిర్ఘాంతపోయి .. కొయ్యబారిపోయే ఉంటాడు .. పాపం.
Must Read ;- హీరోగా రాజీవ్ కనకాల, సుమల తనయుడు











