సాయికుమార్ వాయిస్ సింహం గర్జించినట్టుగా ఉంటుంది. పవర్ఫుల్ డైలాగ్స్ ను రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పడం ఆ వాయిస్ ప్రత్యేకత. రాజశేఖర్ .. సుమన్ వంటి హీరోలు పోలీ ఆఫీసర్ పాత్రల్లో రాణించడంలో సాయికుమార్ వాయిస్ ప్రధానమైన పాత్రను పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణంగానే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసే అవకాశం సాయికుమార్ కి వచ్చింది. చాలాకాలం వరకూ చిన్నచిన్న పాత్రలను వేస్తూ వచ్చిన ఆయన, కన్నడ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ‘అగ్ని’ పాత్రలో ఆయన ఎమోషన్స్ ను పలికించిన తీరు అద్భుతం.

సాయికుమార్ చేసిన ఈ సినిమా కన్నడంలోనే కాదు, తెలుగులోను భారీ విజయాన్ని అందుకుంది. తన వాయిస్ తో తన నట విశ్వరూపాన్ని సాయికుమార్ ఆవిష్కరించిన సినిమా ఇది. అప్పటి నుంచి హీరోగా కూడా ఆయన ఇటు తెలుగులోనూ .. అటు కన్నడలోను వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అవకాశాల పరంగాను .. ఆదరణ పరంగాను ఆయనకి తెలుగులో కంటే కన్నడంలో ప్రాధాన్యత లభించడం విశేషంగానే చెప్పుకోవాలి. హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ రావడంతో సాయికుమార్ ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పడం తగ్గిస్తూ వచ్చాడు. అంతగా ఆయన హీరోగా బిజీ అయ్యాడు.
థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ‘పోలీస్ స్టోరీ’ .. ప్రేక్షకుల ముందుకి వచ్చి దాదాపు పాతికేళ్లు అవుతోంది. అలాంటి ఆ సినిమాకి ఇంతకు ముందు ఓ సీక్వెల్ తీశారు . కానీ మొదటి భాగం స్థాయిలో వర్కవుట్ అవలేదు. ఇప్పుడు మూడో భాగం తెరకెక్కించడానికి రంగం సిద్ద్ధమైంది. గతంలో కన్నడలో ‘పోలీస్ స్టోరీ’ని నిర్మించిన గురురాయ ఫిల్మ్ మేకర్స్ వారే ఈ సీక్వెల్ కి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సీక్వెల్ కి థ్రిల్లర్ మంజునే దర్శకుడు. జనవరి 26వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాదిలో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. తెలుగులో ‘నాలుగో సింహం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సాయికుమార్ మరోసారి గర్జించనున్నాడన్నమాట.
Must Read ;- దుబాయ్ లో మొదలైన నితిన్ మూవీ











