స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అక్కినేని బ్రదర్స్ ను పొడడటం అంటే మామూలు విషయం కాదు. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ తో హిట్లు కొట్టినందుకు వారిద్దరినీ బన్నీ పొగడ్తలతో ముంచెత్తారు. అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఈ సినిమా అఖిల్ కి తొలి విజయాన్ని అందించింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఇటీవల వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవ్వడం విశేషం. ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను ఈ ఫంక్షన్ కి వచ్చేటప్పుడే ఫస్ట్ కంగ్రాట్స్ అఖిల్ కి చెప్పాలని అనుకున్నాను.
అఖిల్ కంగ్రాట్స్. అఖిల్ కి సక్సెస్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. అఖిల్ ను చూస్తే ఒక యంగర్ బ్రదర్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. చాలా బాగా ఫైట్స్ చేస్తాడు. ఈసారి ఆయన మంచి కథకి ప్రాధాన్యతను ఇచ్చాడు. ఒక కొత్త పాత్రను చేయాలనుకున్నాడు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే ఈ రోజున ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెట్టింది.
ఇక అక్కినేని ఫ్యామిలీతో మా ప్రయాణం గురించి చెప్పాలంటే.. చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఏఎన్నార్ గారు మనం సినిమాలో ఇద్దరు మనవాళ్లతో కలిసి నటించారు. రీసెంట్ గా చైతన్య లవ్ స్టోరీ సినిమాతో సక్సస్ సాధించాడు. ఇప్పుడు ఇద్దరు మనవాళ్లు ఒకరు తరువాత ఒకరుగా హిట్ కొట్టడం నాగేశ్వరరావు గారు పై నుంచి చూస్తూనే ఉంటారు. ఇలా ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో హిట్ కొట్టడం అనేది ప్లాన్ చేసినా జరగదు. నిజంగా ఇది చాలా అరుదైన విషయం’ అని అల్లు అర్జున్ అన్నారు. ఇలా.. అక్కినేని బ్రదర్స్ గురించి అల్లు అర్జున్ ఇంట్రస్టింగ్ కామెంట్ చేయడం విశేషం.











