అనుకున్నంతా అయ్యింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ ఖాయమంటూ మంగళవారం నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వాదనలన్నీ నిజమేనన్నట్లుగా బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పట్టాభిని విజయవాడలోని గవర్నర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న కొమ్మారెడ్డి ఇంటికి దాదాపుగా 200 మంది పోలీసులు చేరుకుని.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ పట్టాభిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొమ్మారెడ్డిని అరెస్ట్ చేస్తారన్న భావనతో ఆయనను కాపాడుకునేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా భారీగా అక్కడకు తరలివచ్చి ముందుగా టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేసి ఆ తర్వాత ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ కొమ్మారెడ్డిని అరెస్ట్ చేశారు.
వ్యూహాత్మకంగానే అరెస్ట్
అందరూ అనుకున్నట్లుగా ఉదయమే కొమ్మారెడ్డిని అరెస్ట్ చేస్తే.. వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాల్సి వస్తుందన్న భావనతో ఏపీ సర్కారు.. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదయం కాకుండా రాత్రి వేళ అరెస్ట్ చేస్తే. రాత్రంతా తమ అదుపులోనే కొమ్మారెడ్డిని ఉంచుకునే వెసులుబాటును పోలీసులు వినియోగించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలన్న నిబంధనను అనుకూలంగా మలచుకుని.. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కొమ్మారెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా ఈ తరహాలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏదో అలా కోర్టు ముందు హాజరుపరచి.. జైలుకు తరలించేందుకు సమయం ముగిసిపోయిందన్న కారణాన్ని చూపి రాత్రంతా తమ అధీనంలోనే ఉంచుకుని ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు తనపై సాగించిన దుశ్చర్యను రఘురామరాజు ఆ తర్వాత నేరుగా జడ్జీ ముందు బయటపెట్టడంతో ఆయనను అరెస్ట్ చేసిన సీఐడీతో పాటుగా జగన్ సర్కారుకు చెడ్డ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చెడ్డపేరుకు ఏమాత్రం భయపడని రీతిలో వ్యవహరిస్తున్న జగన్ సర్కారు.. పట్టాభికి కూడా రఘురామరాజు మాదిరే తన ప్రతాపం చూపించాలన్న కసితో ఉన్నట్లుగా కూడా విశ్లేషణలు సాగుతున్నాయి.
పట్టాభిపై థర్డ్ డిగ్రీ వీజీ కాదబ్బా
వైసీపీ సర్కారు వ్యవహారమేంటో పట్టాభి కంటే ఎక్కువగా తెలిసిన వారు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే.. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై అందరికంటే ముందుగా జనానికి చెప్పడంతో పాటుగా ఆయా నిర్ణయాల వెనుక జగన్ సర్కారు ఉద్దేశమేమిటన్న దానిపై కూడా ఆయన వివరణ ఇచ్చిన వైనం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ సర్కారు ఉద్దేశాన్ని పట్టాభి ఎప్పుడో పసిగట్టారనే చెప్పాలి. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఓ అంచనాకు వచ్చిన పట్టాభి.. తనపై ఖాకీ చేయి పడని రీతిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తన ఇంటికి పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వెంటనే ఇంటికి తలుపులు వేసుకుని. తన శరీరంపై చిన్నపాటి గీత కూడా లేదన్న విషయాన్ని బయటకు చెప్పేలా ఓ సెల్ఫీ వీడియో తీసిన ఆయన.. దాని గురించి పోలీసులకు చెప్పారు. ఆ వీడియోను తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్యులకు కూడా పంపారు. పోలీసులు అరెస్ట్ చేయకముందు తనపై ఎలాంటి దెబ్బలు లేవని ముందుగానే చెప్పిన పట్టాభి.. గురువారం ఉదయం నాటికి తన బాడీపై ఏ చిన్నపాటి దెబ్బ ఉన్నా దానికి సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్‌లే బాధ్యత వహించాలని కూడా పట్టాభి ప్రకటించారు. ఈ ప్రకటనతో పట్టాభిపై చేయి వేయడం పోలీసులకు అంత ఈజీ కాదనే చెప్పాలి.