ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019-24 మధ్య వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన వైసీపీ నేతలు..వందల కోట్ల రూపాయలను దేశం దాటించినట్లు తెలుస్తోంది. హవాలా మార్గాల్లో దుబాయికి తరలించినట్లు సిట్ నిర్ధారించింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వైసీపీ నేతలు దుబాయిలో కంపెనీలు పెట్టారని గుర్తించింది. గత ప్రభుత్వ పెద్దల తరఫున ఈ కుంభకోణాన్ని నడిపిన రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డి A-9తో ఈ కంపెనీలను ఏర్పాటు చేయించింది. ఈ అక్రమ సొత్తుతో భారత్‌లో పెట్టుబడులు పెట్టినా, ఆస్తులు కొన్నా రాష్ట్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు జరిగితే..వాటిని స్వాధీనం చేసుకుంటుందని భావించి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2021 నుంచి ఈ హవాలా దందాను మొదలుపెట్టినట్లు తేల్చింది.
హైదరాబాద్‌లోని హవాలా ఏజెంట్ల ద్వారా లిక్కర్ స్కామ్‌లో కొల్లగొట్టిన సొత్తును వైసీపీ ముఠా ఎప్పటికప్పుడు దుబాయికి చేర్చింది. సొత్తును అందుకుని అక్కడ పెట్టుబడులు, కంపెనీలు పెట్టించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డిని 2021లో మూడు సార్లు, 2022లో ఐదుసార్లు, 2023లో 13 సార్లు, 2024లో 8సార్లు దుబాయ్‌కు పంపించింది. ఇలా వెళ్లిన ప్రతిసారీ 10-15 రోజులపాటు కిరణ్ అక్కడే ఉండేవాడు. హవాలా మార్గాల్లో దుబాయ్‌కు చేర్చిన సొత్తుతో కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి కార్యకలాపాలు పర్యవేక్షించేవాడు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభమవటంతో 2024 నవంబరు 30న కిరణ్‌కుమార్‌రెడ్డి దుబాయ్‌కి పారిపోయాడు. మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా పాల్గొన్న అనేక మందిని దుబాయ్‌కే రప్పించి వారికీ ఆశ్రయమిస్తున్నాడు.
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే.. దీనిలో కీలకంగా పాల్గొన్న ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్‌రెడ్డి, వరుణ్ పురుషోత్తం, బొల్లారం శివకుమార్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డి, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాశ్ తదితరులందర్నీ వైసీపీ ముఠా దుబాయ్‌కు పంపించేసింది. మద్యం డబ్బుతో వీరిలో కొందరి పేర్లతో అంతకు ముందే పెట్టుబడులు పెట్టి ఉండటంతో.. కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పలువురికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు సంబంధించిన గోల్డెన్ వీసాలను ఇప్పించింది. ఇదంతా ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని సిట్ దర్యాప్తులో తేల్చింది. దుబాయ్‌లో వారు ఈ కంపెనీలను ఎప్పుడు నెలకొల్పారు? ఎంత పెట్టుబడి పెట్టారు? అందుకు డబ్బు ఎక్కడి నుంచి, ఎలా సమకూర్చుకున్నారు? వాటిలో ఎవరెవరు డైరెక్టర్లు వంటి సమగ్ర వివరాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా UAE ప్రభుత్వానికి లేఖ రాయించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రానికి ఈ మేరకు సమాచారం పంపించారు.
లిక్కర్ స్కామ్ డబ్బుతో విదేశాల్లో పెట్టిన కంపెనీలివే-
దుబాయి – కే కార్ట్ లాజిస్టిక్స్ లిమిటెడ్, టెక్కర్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ, టెక్కర్ ట్రక్ యూఏఈ, ట్రాన్స్‌పోర్ట్ ఎల్‌ఎల్‌సీ కంపెనీలు. వీటితో పాటు నెదర్లాండ్స్‌కు చెందిన హోమ్ వేవ్స్ ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ దుబాయ్ ఫ్రాంఛైజీని కూడా తీసుకున్నారు. లండన్‌లో టెక్కర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీంతో పాటు దుబాయిలో స్థిరాస్థి రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు.











