సోషల్ మీడియా వేదికగా ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం..!
సోషల్ మీడియా అమరావతి ఉద్యమ స్పూర్తిని దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని అమరావతి రైతు గద్దె బుచ్చి తిరుపతి రావు వాపోయ్యారు. అమరావతి ఉద్యమ కారులకు, మహిళలకు, రైతు కూలీలకు, ఉద్యమానికి మొదటి నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నారై మిత్రులకు, దేశవిదేశాల నుంచి ఉద్యమానికి ఊపిరి పోస్తున్న అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులందరూ తన మనవిని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరి సహాయ సహకారాల వల్లనే అమరావతి ఉద్యమం ఈ రోజు వరకూ అప్రతిహతంగా లక్ష్యం వైపు సాగుతోందని, ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ఉద్యమ వ్యతిరేకులు కొందరు ఐక్యత దెబ్బతీసేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పోస్టులు పెట్టటం ద్వారా మనలో ఒకరకమైన గందరగోళం సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనేక అనుమానాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వ్యక్తం చేశారు. పేరుకు వారు ఉద్యమానికి సహాయం చేస్తున్నట్లు ప్రచారం చేసినా.. వారి అసలు ఉద్దేశ్యం మాత్రం ఉద్యమాన్ని నీరు కార్చటమేనని, ఉద్యమానికి సహాయం చేసేవారు ఇంట్లో కూర్చుని విమర్శలు చేస్తూ గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టరని ఆరోపించారు.
నీరుగార్చేందుకు సాగుతున్న కుట్రలు.. బీ కేర్ ఫుల్!
అమరావతి రైతు సాగిస్తున్న ఉద్యమం విజయ తీరానికి అడుగు దూరంలో ఉంది. రాజధానిని మార్చాలన్న ఊసును కూడా అధికార పార్టీ మర్చిపోయేలా స్థాయికి గడిచిన రెండు ఏళ్లుగా అలుపెరగక చేస్తున్న రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు సాగుతున్నాయని బుచ్చి తిరుపతి రావు అవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఉద్యమకారులలో కొంతమంది ఈ కుట్రలు తెలియక, ఈ ఉచ్చులో ఇరుక్కుని తమలో తాము గందరగోళానికి గురై లేనిపోని సందేహాలకు లోనౌతున్నారని వివరించారు. తద్వారా పనికిరాని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఉద్యమ లక్ష్యాన్ని మర్చిపోతున్నారని తెలిపారు. అది రైతులు చేస్తున్న ఉద్యమ స్పూర్తికి మంచిది కాదని వివరించారు. ఏకైక రాజధాని అమరావతి సాధనకు ఉద్యమించిన ప్రతిఒక్కరూ కొన్ని విషయాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని చెప్పుకొచ్చారు. అది నిజాయితీతో, ధర్మబద్ధంగా మహిళలు రైతుల అసమాన పోరాటాలకు మూల కారణంగా నిలిస్తే.. దేశ విదేశాల నుంచి అనేక మంది నిస్వార్థంగా, కేవలం ఉద్యమం కోసం ఇస్తున్న సహాయ సహకారాలు ఆలంబనగా నడుస్తున్న ఉద్యమమే ఏపి రాజధాని అమరావతి ఉద్యమమని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమ క్రమంలో రైతు జెఏసి, అమరావతి పరిరక్షణ సమితి, దళిత జెఏసి, మహిళా జెఏసి, బహుజన జెఏసి, యువ జెఏసి, ఎన్నారై లు, వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యమానికి సంఘీభావం తెలిపే ప్రతి ఒక్కరూ ఈ మహా యజ్ఞం లో భాగస్వాములేనని చెప్పుకొచ్చారు. చివరిగా సోషల్ మీడియాలో ఉద్యమంపై వచ్చే మేసేజ్ లకు స్పందించి, సమయాన్ని కేటాయిచవద్దని, లేనిపోని అపోహలకు లోనుకావద్దని గద్దె బుచ్చి తిరుపతిరావు విన్నవించారు.