కోట్లలో వ్యాపారం.. కనీవినీ ఎరుగని సాంప్రదాయం!
గుడివాడలో సంక్రాంతి సంబరాలు.. దేశం నివ్వెరబోయే రేంజ్ లో సాగాయి. కేసీనో కల్చర్ తో చీర్ గాళ్స్ తో చిందులు, మరో వైపు కోతముక్కలు, కోడి పందేలు, గుండాట, పేకాటలకు తోడు తీన్ పత్తి వంటి ఎన్నడూ లేని వంద రకాల జూద క్రీడలను పరిచయం చేశారు. ‘కే’ కన్వేన్షన్ లో రూ.10 వేల ఎంట్రీ ఫీజుతో సాగిన ఈ వినోదభరిత జూద సంబరాలలో రూ. 150 కోట్లు వరకు వ్యాపారం సాగింది అన్న ప్రచారం ఊపందుకుంది! భారీ సెట్టింగ్స్ తో చేసిన ఏర్పాట్లు కేసినో కల్చర్ ను తలపించింది. వివిధ రకాల స్టాల్స్ ద్వారానే రూ. 15 కోట్లు కొల్లగొట్టారన్నది ఒక అంచనా! రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ముంబై, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా జూద ప్రియులు వచ్చినట్లు సమాచారం. పురుషులకు దీటుగా మహిళలకు కూడా బెట్టింగ్ నిర్వహించి రికార్డు సృష్టించారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా సాక్షాత్తు ప్రజాప్రతినిధులే మందు, విందుల్లో మునిగి తేలుతూ.. చిందేయడం విశేషం!
చట్టం చుట్టమైతే.. ఇక బరితెగింపు కామనేగా?
గుడివాడ ఏలూరు రోడ్డు నుంచి లింగవరం ‘కే’ కన్వెన్షన్ ప్రాంగణం వరకూ ఉన్న ప్రాంతం జూద జాతరను తలపించింది. కోడి పందేలు,పేకాట వంటి వంద రకాల జూదాలు యథేచ్ఛగా సాగుతుంటే.. నియంత్రించాల్సిన పోలీసులు, చట్టాలు ఏమైపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడి పందేలు, జూదాలపై నిషేదం ఉన్నా, కోర్టులు హెచ్చరిస్తున్న పోలీసు శాఖ అడ్డుకునే కనీస ప్రయత్నం చేయకపోవడం సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాక ఏపీలో ఎన్నడూ లేని విధంగా కేసినో కల్చర్ ను నిలువరించ లేకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది! సంక్రాంతికి ముందు చట్టాలు మేల్కొని హెచ్చరికలు జారీ చేస్తాయి.. తీరా సంబరాల్లో జూదం, కోడి పందేలు కామన్ గా మారిన వేళా.. ఆ ప్రాంతంలో నో పోలీస్ అన్న మాదిరిగా పత్తా లేకుండా పోవడం దేనికి సంకేతం? అని ప్రశ్నిస్తున్నారు. గుడివాడ డివిజన్ లోని మంత్రి కొడాలి నాని ఇలాకాలలో తొమ్మిది మండలాల్లో కోడిపందేలతోపాటు గుండాట, కోతముక్క రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగంగానే నిర్వహించడం చర్చకు దారితీస్తోంది!