ఆయన చెరుకు కర్మాగారంలో పనిచేసే ఒక చిరుద్యోగి. పుస్తకాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదు దశాబ్దాల్లో 15 లక్షల పుస్తకాలు సేకరించి ఇంట్లో భద్రపరిచాడు. ఆయన సేకరణలో 8 విదేశీ, 22 భారతీయ భాషలకు చెందిన వేలాది అరుదైన పుస్తకాలున్నాయి. వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ‘పుస్తకద మనె’ (పుస్తకాల ఇల్లు) ఏర్పాటు చేశాడు. దక్షిణ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ పుస్తకాలయాల్లో ఇదొకటి..
అంకేగౌడకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ప్రాణం. పేదరికం వల్ల పెద్దగా చదువుకోలేదు. అయితేనేం.. పుస్తకం కనిపిస్తే వదిలేవాడు కాదు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉన్న హరళహళ్లి ఆయన సొంతూరు. అక్కడే ఒక చెరుకు కర్మాగారంలో పని చేసేవాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో పుస్తకాలు కొనడం అలవాటుగా మారింది. అప్పట్లో జేబులో పావలా ఉన్న సరే వెంటనే ఒక పుస్తకం కొనేవాడు. వాటిని జాగ్రత్తగా ఇంట్లో భద్రపరచడం మొదలెట్టాడు. ఆ విధంగా యాభై ఏళ్లలో సుమారు 15 లక్షల పుస్తకాలు సేకరించాడు. అంకేగౌడ తన సంపాదనలో మూడొంతులు పుస్తకాల కోసమే వెచ్చించడం విశేషం. తాను పెద్దగా చదువుకోలేకపోయినా భావి తరాల కోసం ఏదో ఒక ఉపయోగపడే పని చేయాలని నిశ్చయించుకుని ‘పుస్తకద మనె’ను ఏర్పాటు చేయాలనుకున్నాడు.
18 గంటలు గ్రంథాలయంలోనే…
ఈ మహాయజ్ఞంలో అంకేగౌడకు ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు సాగర్ సహకరించారు. ప్రతీరోజూ ఈ గ్రంథాలయాన్ని శుభ్రం చేసి, ఒక క్రమపద్ధతిలో పుస్తకాలను పేర్చడం చేస్తుంటారు. సహాయకులను పెట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులే గ్రంథాలయ నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఈ నేపథ్యంలో అంకేగౌడ రోజుకు 18 గంటలు గ్రంథాలయంలోనే గడుపుతుంటాడు. పుస్తక ప్రపంచంలో పడిపోయి ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం చిక్కదని అంటున్నారాయన. లక్షల పుస్తకాలను భద్రపరచడం అనేది కత్తిమీద సాములాంటిది. వాటి కోసం పెద్ద సంఖ్యలో ర్యాకులు అవసరం అవుతాయి. అయితే తనకు ఉన్నంతలోనే ర్యాకులు కొని, వాటిలో పుస్తకాలను క్రమపద్ధతిలో పెడుతున్నారు. కావాల్సినన్ని ర్యాకులు లేక 6 లక్షలకు పైగా పుస్తకాలు నేలపైనే కనిపిస్తాయి.
పరిశోధక విద్యార్థులకు జ్ఞాన భాండాగారం…
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమ పరిశోధనలకు కావాల్సిన పుస్తకాల కోసం ‘పుస్తకద మనె’కు వస్తుంటారు. బెంగళూరు విశ్వవిద్యాలయం, మైసూరు విశ్వవిద్యాలయం, కువెంపు విశ్వ విద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, హంపీ విశ్వవిద్యాలయం… ఇలా పలు వర్శిటీల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులతో నిత్యం ‘పుస్తకద మనె’ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈమధ్య దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కూడా అరుదైన పుస్తకాల కోసం ఇక్కడికి వస్తున్నారని అంకేగౌడ తెలిపారు. ఆయన కృషిని ఎంతోమంది మేధావులు, పుస్తకాభిమానులు, పరిశోధకులు మెచ్చుకున్నారు. ఈ గ్రంథాలయాన్ని ‘అంకేగౌడ జ్ఞాన ట్రస్టు’ ఆధ్వర్యంలో ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు.
ఒక వ్యక్తిగా అన్ని లక్షల పుస్తకాలను సేకరించి, భద్రపరిచినందుకు 2016లో ఆయన ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో స్థానం సంపాదించారు. అంతేగాక 2009లో పుస్తక ప్రాధికార పురస్కారం, 2011లో రాష్ట్ర గ్రంథాలయ శాఖ అవార్డు, 2014లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు ‘రాజ్యోత్సవ’తో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. పుస్తకాల సేకరణతో పాటు కొన్ని దశాబ్దాలుగా అంకేగౌడ నాణేలు, కరెన్సీ సేకరణ కూడా చేస్తున్నారు. దాతలు, ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ‘పుస్తకద మనె’ దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది పుస్తక ప్రియులు, పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావొచ్చనేది అంకేగౌడ ఆలోచన. అంకేగౌడ ఫోన్ నెంబర్: 92428 44934.
ఎవరికి ఏ పుస్తకం కావాలన్నా…
‘పుస్తకద మనె’లో అసంఖ్యాక నవలలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, వివిధ భాషల్లోని వేలాది మ్యాగజైన్లు, వంటల పుస్తకాలు, సినిమా పుస్తకాలు, వైద్య, క్రీడా రంగాలకు సంబంధిచిన అనేక గ్రంథాలున్నాయి. జాతిపిత గాంధీజీకి సంబంధించి 2,500 పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘‘అప్పట్లో ఒక చిన్న ఇంట్లో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించాను. పుస్తకాలు వేల సంఖ్య నుంచి లక్షల్లోకి పెరగడంతో ఆస్తులన్నీ విక్రయించి, పెద్ద భవంతిని నిర్మించా. నా వయసు ప్రస్తుతం 72 ఏళ్లు. పుస్తకాల సేకరణ తపన ఇంకా తీరలేదు. ఇప్పటికీ పుస్తకాలు కొంటూనే ఉంటా’’ అన్నారు అంకేగౌడ…
– అబ్దుల్ రజాక్, బెంగళూరు