దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ ఆంధ్రప్రదేశ్ పైన పెడుతున్న ఫోకస్ మామూలుగా లేదు. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు సహకరిస్తున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఏపీలో ఆదానీ గ్రూపు వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని పరిశ్రమలు ఇంకా కార్యకలాపాలు మొదలు కాకపోయినప్పటికీ జగన్ ప్రభుత్వం మాత్రం ఆయనకు అప్పనంగా దోచిపెడుతూనే ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. భూములు, డేటా సెంటర్, పోర్టులు.. ఇలా అదానీ వేలెత్తి చూపించిందల్లా వైఎస్ జగన్ ఆయనకు ఇచ్చేశారు. ఇప్పటికే ఏపీలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు పలు ప్రాజెక్టుల్ని అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది.
ఆదానీకి చెందిన పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు, డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం కేబినెట్ భేటీలో వందల ఎకరాల భూములను వారికి కట్టబెట్టింది. విశాఖపట్నంలో పెట్టాలనుకుంటున్న మరో డేటా సెంటర్ కోసం తర్వాత మరో 60 ఎకరాలు కేటాయించారు. సదరు 139 ఎకరాల్లో ఇప్పటికి కూడా అసలు పనులే మొదలేదు. అయినా అదే జోరుతో అదానీ గ్రూప్‌నకు మాత్రం అదనపు భూములను ప్రభుత్వం కేటాయిస్తూ వచ్చింది.
గత సెప్టెంబరు నెలలో గౌతమ్ ఆదానీ ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి, తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. అంత పెద్ద పారిశ్రామిక వేత్త జగన్ ఇంటికి వచ్చి కలిశారంటే.. అది కచ్చితంగా మార్యాదపూర్వక భేటీ అస్సలు అవ్వదు. అగ్ర వ్యక్తులు పనిగట్టుకొని మరీ రహస్యంగా మాట్లాడుకున్నారంటే.. కచ్చితంగా కీలకమైన బిగ్ డీల్ అయి ఉంటుందనే అభిప్రాయాలు అప్పుడు వ్యక్తం అయ్యాయి. కానీ, వీరి భేటీకి సంబంధించి ఏం చర్చించుకున్నారనే అంశాన్ని ఏమాత్రం బయటకు పొక్కనీయలేదు. ఇప్పటి దాకా వారికి కట్టబెట్టింది చాలక కొత్తగా ఇంకేమి ఇవ్వబోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఏపీలో ఆదానీకి పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మార్ వంటనూనెల పరిశ్రమలు కూడా ఉన్నాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేళ అదానీ గ్రూప్ దీన్ని సొంతం చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం భూములు కేటాయించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా అక్కడ ఏ పనులూ మొదలు కాలేదు. పైగా ఆ మధ్య హిండెన్ బర్గ్ నివేదిక వల్ల ఆదానీ ప్రతిష్ఠ దిగజారి, ఆయన కంపెనీల షేర్లు కుప్పకూలినా కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఆయనపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు జగన్ ఎప్పుడో సరెండర్ అయిపోవడం వల్లే వారి ప్రభావంతో ఇక్కడ సీఎం ఆదానీకి అంతా దోచిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.











