మరికొద్ది రోజుల్లో దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. డిసెంబరు 3న 5 రాష్ట్రాల ఫలితాలు విడుదల అవుతాయి. దీంట్లో ఫలితాలను బట్టి ఏపీ సీఎం జగన్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీ జోరు ప్రదర్శించినా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని గురించి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కలవరపాటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరంలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే ఎక్కువ స్వింగ్ ప్రదర్శిస్తే ఆ ప్రభావం వచ్చే మార్చిలో జరిగే సాధారణ ఎన్నికలపై స్పష్టంగా పడుతుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టే బీజేపీ వ్యూహాలను చాలా పదునుగా తయారు చేసి అమలు చేస్తుంది. మొత్తానికి కేంద్రంలో అధికారం నిలుపుకోవడంమే లక్ష్యంగా ఆ వ్యూహాలు ఉంటాయి. కాబట్టి, వైఎస్ఆర్ సీపీకి నష్టమే అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికే అన్ని సర్వేలు జగన్ కు వ్యతిరేకంగా ఉంటున్నాయి. అటు కాంగ్రెస్ బలం పుంజుకుని, ఇటు ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రాబల్యం తగ్గితే ఆటోమేటిగ్గా బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.
అలా టీడీపీ – జనసేన పార్టీలో కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2014 తరహాలో ఏపీలో రాజకీయం రిపీట్ అవుతుందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంపీ రఘురామ జగన్ అక్రమాస్తులు, ఏపీలో ఆర్థిక అవకతవకలపై సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుల్లో వేసిన పిటిషన్లలో కూడా కదలిక త్వరగా వచ్చింది. సీఎం జగన్ సహా ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. అసలు ఈ పిటిషన్లు కేంద్ర ప్రభుత్వమే ఎంపీ రఘురామతో వేయించిందనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి సెమీ ఫైనల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనబరిస్తే మాత్రం వైఎస్ఆర్ సీపీకి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.











