ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెత మనకు ఉండనే ఉంది.దీనికి ప్రత్యామ్నాయంగా ఓట్ల దొంగను ఈసీ కూడా పట్టలేదు అనుకోవచ్చేమో. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం చూస్తుంటే దొంగ దొరకడేమో అనుకున్నాంగానీ చివరికి దొరికేసినట్టే. ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ఈసీ సెప్టెంబరులో ప్రకటించి సంచలనానికి తెరలేపింది. జీరో నెంబరు, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఏపీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో యావత్ ప్రజానీకం విస్తుపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణాలుగా ఈవీఎంల ట్యాంపరింగ్, నవరత్నాలు, ఒక్కఛాన్స్ లాంటివి కారణమయ్యాయని అందరూ భావించారుకానీ అంతకంటే పెద్ద గూడుపుఠాణి దొంగఓట్లన్న సంగతి ఇన్నాళ్లకు బయటపడింది. దొంగ ఓట్లు ప్రభావం ఇంత ఉంటుందా అనిపించవచ్చుగానీ లోతుగా ఆలోచిస్తే ఫలితాలను తారుమారు చేయడంలో అవే కీలకం అన్నది స్పష్టమవుతోంది.
చేజారిన సీట్లు
ఏపీలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని జూన్ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై ఒకరికొకరు బురద జల్లుకున్నారు. బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పునపరిశీలనను ఎన్నికల సంఘం చేపట్టడంతో దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగుచూసింది. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. ఎందుకంటే 2019లో ఫలితాలు ఎలా తారుమారయ్యాయో ఓసారి చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేల కన్నా తక్కువ మెజార్టీతో దాదాపు 21 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే 5వేల నుంచి 10 వేల తేడాతో 23 సీట్లు పోయాయి. 10 వేల నుంచి 15 వేల మధ్య మరో 23 సీట్లు చేజారాయి. అలా చూస్తే ఈ సంఖ్య 67కు చేరింది. మనకు వచ్చిన 23 సీట్లను వీటికి కలిపితే తెలుగు దేశం పార్టీకి 90 సీట్లు దక్కేవి.
బూత్ స్థాయిలో..
లోతుగా విశ్లేషించాలంటే బూత్ స్థాయిలో పరిశీలించాలి. సాధారణంగా 1000 నుంచి 1500 ఓట్లకు ఒక బూత్ ఏర్పాటవుతుంది. అంటే ఒక్కో శాసనసభ నియోజక వర్గానికి 250 నుంచి300 బూత్ లు ఉంటాయి. ఒక్కో బూత్ లో 18 దొంగ ఓట్లు పడితే దాదాపు 5000 వేల ఓట్ల తేడా వచ్చేస్తుంది. ఆ తేడానే 2019లో తెలుగు దేశం పార్టీ కొంపముంచింది. అంటే నైతికంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. అందుకే ఫేక్ ఓట్లను రాయించుకోవడానికి వైసీపీ తన శాయశక్తులా ప్రయత్నించింది.. మళ్లీ ప్రయత్నిస్తోంది. ఒక్క ఓటు విలువ ఎంత గొప్పదో దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది. ఇలాంటి దొంగ ఓట్లను తొలగించుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉన్నారు. మొదట్లో ఈ విషయం తెలియక ఈవీఎం ల ట్యాంపరింగ్ అనుకున్నారు. పోలింగ్ రోజున బూత్ ఏజంట్ల నిర్లక్ష్యం మూలంగా ఇవి బయటపడలేదు. అందుకే ఇప్పుడే మేలుకోవాలి. ప్రతి బూత్ లోనూ ఓట్ల వెరిఫికేషన్ సక్రమంగా జరగాల్సిందే. గ్రామస్థాయి కార్యకర్తలు ఈ విషయంల అప్రమత్తంగా ఉంటే తప్ప దొంగ ఓట్లను అరికట్టలేదు. ఎన్నికలకు సమయం కూడా సమీపిస్తోంది. ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ పై దృష్టి సారిస్తే ఈ దొంగ ఓట్లను అరికట్టడం చాలా తేలిక. ఓటర్ల సంఖ్య కూడా 2019 నాటికీ ఇప్పటికే బాగా పెరిగింది. ఏపీలో దాదాపు నాలుగు కోట్ల ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా నేతలు ముందే మేలుకుంటే మంచింది. అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాల్సిందే.