(తిరుపతి నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలం అవుతోంది. ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కార్యక్షేత్రం లోకి దిగుతున్నారు. వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై వివిధ పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గత ఏడాది కాలంగా కేవలం విలేకరుల సమావేశాలకు పరిమితమైన నేతలు వీధుల్లోకి వచ్చి పోరాటాలకు సిద్ధమయ్యారు. ఇటీవల చంద్రగిరి, తిరుపతి ఇ నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం. జిల్లాలో తమ్ముళ్ళ క్రియాశీలతను స్వయంగా ఫోన్ చేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించడం గమనార్హం.
గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం చిత్తూరు జిల్లాలో కేవలం కుప్పం నియోజకవర్గానికి పరిమితం అయింది. కుప్పంలో సైతం పార్టీ అధినేత చంద్రబాబుకు గతంతో పోలిస్తే మెజారిటీ గణనీయంగా తగ్గింది. మిగిలిన 13 నియోజకవర్గాలలో లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోర పరాజయాన్ని మూట కట్టుకోలేదు. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను కోల్పోయింది. దీంతో పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు ఢీలా పడిపోయారు. కొన్ని నెలలు స్తబ్దుగా ఉండిపోయారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలోనూ చురుకుగా పాల్గొనలేదు. తర్వాత చంద్రబాబు తిరుపతి పర్యటన అనంతరం కొంత ఉత్సాహం తెచ్చుకున్నారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో విలేకర్ల సమావేశాలకు పరిమితం అయ్యారు. గతంతో పోల్చితే క్రియాశీల కార్యకర్తలు సైతం సైలెంట్ అయిపోయారు.
రోడ్డెక్కిన శ్రేణులు..
చంద్రగిరి నియోజకవర్గంలో రాజేష్ కుమార్ అనే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెట్టారని అభియోగం మోపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 5 గంటల సేపు ధర్నా జరిగింది. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు ఫోన్ చేసి పులవర్తి నానితో మాట్లాడారు. కార్యకర్తలకు ఎక్కడ అ అన్యాయం జరిగినా వెంటనే స్పందించారని, రాజీలేని పోరాటం సాగించాలని బోధించారు. దీంతో స్థానిక నేతల్లో జోష్ పెరిగింది. తిరుపతిలో సైతం స్థానిక అంశాలపై ఇప్పుడిప్పుడే నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సాధారణ ఎన్నికలు ముగిసిన 15 నెలల తర్వాత తెదేపా నాయకులు వీధిలోకి వచ్చి పోరాటాలను మొదలుపెట్టారు. దీంతో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకం అవుతున్నారు. భవిష్యత్తులో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా జిల్లా రాజకీయ యవనికపై పోరాటాల దృశ్యాలు భవిష్యత్తు వేదిక పై ఆవిష్కృతం కానున్నాయ నడంలో సందేహం లేదు.
..క్రిష్