సింహాచలం దేవస్థానం భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటుందా? సిఫారసు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకుంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు… అప్పన్న భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల్లో అధిక పాపం రాజకీయ నాయకుల ఖాతాలోకే చేరుతుంది. సిఫార్సుల మేరకే వందలాది ఇళ్ల నిర్మాణాలు గత ఐదేళ్లలో జరిగాయి.
మరమ్మతులకు అనుమతించేవారు కాదు..
ఓ ఏడెనిమిది ఏళ్ళు వెనక్కి వెళితే సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల్లో ఇంటి మరమ్మతులకు సైతం అనుమతి ఉండేది కాదు. ఇల్లు కారిపోతున్నా, బాత్ రూమ్ శిథిలావస్థకు వచ్చినా అవస్థలు పడాల్సిందే తప్ప, ఒక్క సిమెంట్ బస్తా పనులకు కూడా అనుమతించేవారు కాదు.
తరువాత జరిగిన జిల్లా రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యేలంతా దేవస్థానం అధికారుల తీరుకు వ్యతిరేకంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరమ్మతులకు అనుమతి లభించింది. దానిని ఆసరాగా తీసుకుని వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలకు మరమ్మతుల పేరిట అనుమతులు ఇచ్చేశారు. ఇందులో ముందు వరుసలో ఉన్న వ్యక్తి అప్పటి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు.
అంచనా ప్రకారం 300 నుంచి 400 వరకు సిఫార్సు లేఖలు ఈయన పంపినట్టు దేవస్థానం సిబ్బంది పేర్కొంటున్నారు. మంత్రి కావడంతో కాదనలేక, ఊ.. కొట్టలేక అధికారులు సతమతమయ్యేవారు. ఇంటి మరమ్మతుల కోసం దేవస్థానం అంగీకారం తెలిపితే… ఖాళీ స్థలాలు, పై అంతస్తులు ఇలా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేశారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు… ఇలా ప్రతి ఒక్కరు సిఫార్సులు చేయడంతో పంచ గ్రామాల్లో వందలాది కొత్త నిర్మాణాలు వెలిశాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లో ఉన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు దేవస్థానం భూముల్లో నిర్మాణాలకు రికమండేషన్ చేసినవారే.
దండుకున్న దేవస్థానం సిబ్బంది..
ఎమ్మెల్యేల లేఖ ఆధారంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో దేవస్థానం భూ పరిరక్షణ విభాగం సిబ్బంది అగ్రస్థానంలో నిలిచారు. ఒక్కో నిర్మాణం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, వాటికి రాజకీయనాయకుల రంగులు అద్ది కోటీశ్వరులు అయ్యారు. ఈ క్రమంలో ఎగ్జిక్యూటివ్ అధికారికి గుంపగుత్తగా వస్తున్న లేఖలపై అనుమానం రావడంతో విచారణకు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. దాని నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు నకిలీవి సృష్టించి అధికారులు తప్పించుకున్నట్లు ప్రచారంలో ఉంది. వీటన్నింటినీ పక్కన పెడితే… తాజాగా ప్రారంభమైన సర్వేలో ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయా? అవినీతికి పాల్పడిన అధికారులతోపాటు సిఫారసు లేఖలు పంపిన రాజకీయ నేతల పైన చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది వేచిచూడాలి.
అధికారులతో సరిపెట్టకుండా, నాయకుల మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోదలిస్తే.. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా నుంచి, ఇప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ వరకు అందరికీ ఇబ్బంది తప్పదనే వాదన వినిపిస్తోంది.











