తెలంగాణ రాష్ట్రాన్ని గత వారం రోజులుగా వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. భారీ వర్షాల తాకిడికి మహా నగరం మొత్తం ఆగమాగం అయ్యింది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకురావడానికి ప్రముఖులు విరాళాలు అందజేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
కష్టమేదైనా.. ముందు మేముంటాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపును అందుకున్న వెంటనే సినీ తారలు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు భారీ విరాళాలనే ప్రకటించారు కూడా. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ పొగడ్తలతో ముంచేత్తారు.
మరి జగన్ ఎందుకు పిలుపునివ్వలేదు
రాష్ట్రానికి ఏ విపత్తు వచ్చినా సీఎం పిలుపు మేరకు ముందుగా స్పందించేది సినీ ఇండస్ట్రీనే అని అందరికి తెలుసు. ఆంధ్ర ప్రదేశ్ అతలాకుతలం అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు విరాళాల కోసం పిలుపునివ్వలేదు. గతంలో ఎన్నో విపత్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించినప్పుడు ముఖ్యమంత్రి పిలుపు మేరకు సినీ తారలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందించారు. ఆ విపత్తు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు సమానంగా విరాళాలు అందించారు.. సినీ తారలు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూడా నగదు సేకరించేవారు.
విపత్తును అంచనా వేయడంలో తడబడుతున్నారా?
ఈ వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే తెలంగాణ కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగిందని చెప్పవచ్చు. కానీ అక్కడి తీవ్రతను తెలపడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తుంది. చేతికి వచ్చిన పంట పడవ్వడంతో పాటు, ఎన్నో వేల ఎకరాల్లో ఉన్న పంట కూడా నీట మునిగింది. ఈ తీవ్రతను ఎందుకు అధికారులు గుర్తించడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాష్ట్రం కోసం నిధులు విడుదల చేయమని కోరారే కానీ.. తనకు అందుబాటులో ఉన్న వారిని ఎందుకు అడగడం లేదు అనేది ఇప్పుడు చర్చానీయాంశమైంది.
స్వచ్ఛంధంగా ఎందుకు ముందుకు రాలేదు?
వరదలు వల్ల రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది రైతులనే చెప్పవచ్చు. సినిమాల్లో రైతుల గురించి గొప్పగా చెప్పి అభిమానుల మనసులు దోచేయడం మన తారలకు వెన్నతో పెట్టిన విద్యే. మరి హైదరాబాద్ మునిగిపోతే నగర అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చిన తారలు…. ఇక్కడ నీట మునిగిన పంటల గురించి ఎందుకు పట్టించుకోలేదు. స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ఎందుకు విరాళాలు ఇవ్వడం లేదు. రైతుల బాధల గురించి తెలిపేది కేవలం సినిమాల్లోనేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.