ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రాక ముందే తమ ప్లాట్ ఫామ్స్ నుంచి గూగుల్ భారీగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించింది. దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 26న కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దీంతో ఫేస్బుక్, ట్విట్టర్ తో పాటు గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వచ్చాయి. కేంద్రం లేదా దర్యాప్తు సంస్ధలు అడిగినప్పుడు వీటిలో ఉంచే కంటెంట్ మూలాలపై వివరాలు ఇవ్వడంతో పాటు, అభ్యంతర కరమైన కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.
ఏప్రిల్‌లోనే 60 వేల కంటెంట్ పీసుల తొలగింపు
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ దేశంలో కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రాకముందే అంటే ఏప్రిల్‌లోనే తమ ప్లాట్ ఫామ్స్ నుంచి అభ్యంతరకరమైన కంటెంట్‌ను భారీగా తొలగించింది.ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 60 వేల కంటెంట్ పీసుల్ని గూగుల్ తొలగించింది. గూగుల్ తాజాగా విడుదల చేసిన నెలవారీ పారదర్శకత నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది.
27,700 ఫిర్యాదులతో..
గూగుల్ కంటెంట్‌పై భారత్‌లోని వ్యక్తుల నుంచి వచ్చిన 27,700 ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లున్న సోషల్ మీడియా సంస్ధలు తమ ప్లాట్ ఫామ్‌ల్లో ఉంచే కంటెంట్‌కు సంబంధించి అందే ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారో కేంద్రానికి వెల్లడించాలి. గూగుల్ కేంద్రానికి ఇచ్చిన పారదర్శకత నివేదికలో కంటెంట్ తొలగింపు విషయం వెల్లడయ్యంది. ఇదేమీ తమకు కొత్త కాదని, 2010 నుంచే తాము పారదర్శకత నివేదికలు రూపొందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
Must Read ;- ట్రంప్‌కు ఫేస్ బుక్ షాక్..!











