అమూల్… గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తిదారుల సమాఖ్య. పాల ఉత్పత్తిదారులకు అధిక ధరలను చెల్లిస్తామని చెప్పుకున్న ఈ సంస్థ తాజాగా తనదైన ఫక్తు మార్కెట్ ట్రిక్కులను పాటించడం మొదలెట్టిందనే చెప్పాలి. ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ డెయిరీని నాశనం చేయడమే లక్ష్యంగా అమూల్ డెయిరీని రాష్ట్రంలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే… జిల్లాలకు జిల్లాలను దత్తత ఇస్తున్నట్లుగా అధికార యంత్రాంగం మొత్తం పాలను అమూల్ కే పోయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇందుకోసం ఇతర డెయిరీల కంటే అమూల్ ఎక్కువ ధరను చెల్లిస్తుందని ప్రచారం చేసింది. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సహకారంతో అమూల్ కు ఓ మోస్తరులో రైతులు పాలు పోస్తున్నారు.
లీటరుపై రూ.2 పెంపు
రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాలకు పాకిన నేపథ్యంలో అమూల్ తన విశ్వరూపాన్ని చూపడం మొదలెట్టింది. కనీసం రాష్ట్రవ్యాప్తంగా తన పాల సేకరణను విస్తరించే దాకా కూడా ఆ సంస్థ ఆగలేదు. ఈ క్రమంలో తనదైన మార్కెటింగ్ ట్రిక్కులను ప్రయోగించిన అమూల్… తాజాగా తన పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతూ బుధవారం సాయంత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అంతేకాకుండా ఈ ధరల పెంపు నిర్ణయం తక్షణమే అంటే… జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందని పిడుగు లాంటి వార్తను వదిలింది. అంటే… గురువారం నుంచి అమూల్ పాల ధర లీటరు రూ.2 అధికంగా చెల్లించాలన్న మాట.
ధరల పెంపునకు కారణాలివేనట
పాల ధరను పెంచుతూ అమూల్ తీసుకున్న నిర్ణయంలో మరింత ఆందోళన రేకెత్తించే అంశం కూడా దాగి ఉంది. తన బ్రాండ్ కింద వినియోగదారులకు అందించే అన్ని రకాల పాలకూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ధరల పెంపునకు గల కారణాలను వెల్లడించిన ఆ సంస్థ… ఉత్పత్తి ఖర్చులతో పాటు ప్యాకింగ్, రవాణా, ఇంధన వ్యయం కూడా పెరగడం వల్లే ధరల పెంపు నిర్ణయ తీసుకోవాల్సి వచ్చిందని చిలుక పలుకులు పలికింది. మొత్తంగా పాల ఉత్పత్తిదారులకు న్యాయం చేస్తామంటూ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన అమూల్… రైతుల సంఖ్య కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే వినియోగదారుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. మరి అమూల్ దంచుడు నిర్ణయంపై వైసీపీ ఎలాంటి కలరింగ్ ఇస్తుందోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అమూల్‌పై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశం