యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు.. విడుదల తేదీని కూడా వాయిదా వేసుకుంది. ఇక తారక్ దీని తర్వాత తన 30వ చిత్రాన్ని అజేయ దర్శకుడు కొరటాల శివకి అప్పగించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. యన్టీఆర్ కు నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉండడం హాబీగా మారింది. తన సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానులతో షేర్ చేసుకోడానికి ట్విట్టర్ ను చాలా సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నాడు. కొన్నాళ్ళు గా యంగ్ టైగర్ ట్విట్టర్ అకౌంట్ ను చాలా యాక్టివ్ గా ఉంచుతున్నాడు. దాంతో ట్విట్టర్ లో అతడి ఫాలోవర్స్ సంఖ్య ఎంతో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నందమూరి కుర్రోడు ఒక అరుదైన ఘనతను సాధించాడు.
ట్విట్టర్ లో యన్టీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్స్ మార్క్ దాటడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్నిస్తోంది. అయితే యన్టీఆర్ కంటే ఈ మార్క్ దాటిన పలువురు టాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. అందులో మొదటగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 11.4 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉండగా.. సెకండ్ పొజీషన్ లో కింగ్ నాగ్ .. 6 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ 5.8 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు.