ఓ సినిమా ఇలా థియేటర్లలోకి వస్తుంది.. అలా వెళ్లిపోతుంది. కానీ ఓటీటీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే
సినిమాలు పనికిరావు. వాళ్లకు రిచ్ కంటెంట్ కావాలి. క్వాలిటీ మాత్రమే కాదు, క్వాంటిటీ కూడా ఉండాలి. అప్పుడే వ్యూయర్ షిప్ పెరుగుతుంది. సరిగ్గా ఇక్కడే మీడియేటర్లు (మధ్యవర్తులు) ఓటీటీ పుట్టిముంచుతున్నారు.
కంటెంట్ లేని సినిమాలకు కూడా హైప్ క్రియేట్ చేసి, ఓటీటీ జనాలతో భారీ రేట్లకు కొనిపిస్తున్నారు. కమిషన్ కు కక్కుర్తి పడి మధ్యవర్తులు చేస్తున్న ఈ పని వల్ల.. ఓటీటీలు భారీగా నష్టపోతున్నాయి. అటు సదరు నిర్మాతపై ఓటీటీ సంస్థలకు ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతోంది.
ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.. రీసెంట్ గా ఓటీటీలోకి ఓ సినిమా వచ్చింది. నిజాలు మాట్లాడుకుంటే మార్కెట్ రేట్లు ప్రకారం, ఆ సినిమా డిజిటల్ రైట్స్ ఖరీదు 30 లక్షలు కూడా చేయదు. అలాంటి సినిమాను సదరు మధ్యవర్తి, కల్లబొల్లి మాటలు చెప్పి 2 కోట్ల రూపాయలకు అంటగట్టాడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. 2 కోట్లలో నిర్మాతకు కేవలం కోటి 20 లక్షలు మాత్రమే వెళ్లింది. మిగతాదంతా కమీషన్ కింద పోయిందన్నమాట. ఇప్పుడా సినిమాకు ఎలాంటి ఆదరణ లేదు. సదరు ఓటీటీ లబోదిబో మంటోంది.
అమెజాన్ లో వ్యవహారం అంతా దళారుల మీదే నడుస్తుంది. నేరుగా అమెజాన్ ప్రతినిథులు నిర్మాతలతో సంప్రదింపులు జరపరు. వారికి టాలీవుడ్ తో పెద్దగా సంబంధాలు కూడా ఉండవు. ఓ మధ్యవర్తి నిర్మాతతో
అగ్రిమెంట్ రాసుకుంటాడు. తన ద్వారా మాత్రమే ఆ సినిమా అమెజాన్ కు వెళ్లాలనేది ఆ ఒప్పందం. నిర్మాత ఆశలు, సినిమాలో సరుకు బట్టి కమీషన్ పర్సంటేజీ మారిపోతుంది. ఇలా పిండుకున్నోడికి పిండుకున్నంత అన్నట్టు ఉంటుంది వ్యవహారం.
సినిమా వాచ్ అవర్స్ ని బట్టి నిర్మాతకు పర్సంటేజీ వెళ్తుంది. మరికొన్ని సినిమాల్ని గంపగుత్తగా తీసుకునే బాపతు కూడా ఉంది. ఇలా ఏ రకంగా సినిమా తీసుకున్నా మధ్యవర్తికి కాసుల పంటే. ఎందుకంటే నిర్మాతకు నేరుగా యాక్సెస్ లేదు కాబట్టి. అదే నిర్మాతతో నేరుగా డీల్ పెట్టుకుంటే, ఓటీటీలకు ఈపాటికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలేవి. నిర్మాతలకు కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికేది. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడా లేవు.
అయితే నెట్ ఫ్లిక్స్ లో వ్యవహారం దీనికి కాస్త భిన్నం. అక్కడ కూడా మీడియేటర్లు ఉన్నారు. కాకపోతే సదరు సంస్థ ఉద్యోగులు కూడా డీల్స్ చేస్తుంటారు. కాకపోతే ఎందుకో ఈ యాక్సెస్ చాలా తక్కువ. తెలుగు నుంచి నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న సినిమాలను చూస్తే ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఈ కారణాల వల్ల నెట్ ఫ్లిక్స్ లో కమీషన్లు కాస్త తక్కువనే చెప్పాలి.
ఇక జీ5, ఆహా లాంటి సంస్థల్లో సినిమాకు సినిమాకు స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకునే పద్ధతులు మారిపోతాయి. సినిమా స్థాయి, అందులో ఉన్న నటీనటులు, బడ్జెట్ బట్టి వీళ్లు హక్కులు దక్కించుకునే పద్ధతులుంటాయి. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు డైరక్ట్ గా సంప్రదింపులు జరిపితే, మరికొన్ని సినిమాలకు మధ్యవర్తులు రంగంలోకి దిగుతారు. ఇలా ప్రతి ఓటీటీ సంస్థలో దళారులు, పైరవీలు కామన్ అయిపోయాయి.
Must Read ;- థియేటర్లు తెరిచినా మళ్లీ అదే సస్పెన్స్











