రాయలసీమ.. ఒకప్పుడు నిజంగానే రతనాల సీమ. మరి ఆ రతనాల సీమ ఇప్పుడు కరువు సీమగా ఎందుకు మారింది? దుర్భిక్షంతో అల్లాడుతున్న రాయలసీమ కష్టాలు తీర్చే దిశగా ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తెలుగు దేశం పార్టీనేనని చెప్పక తప్పదు. ఈ వాదన కోసం మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సీమలో ఇప్పుడు కొన్ని ప్రాంతాల దాహార్తిని అయినా తీరుస్తున్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను గుర్తుకు తెచ్చుకుంటే చాలు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టులకు రూపకల్పన జరగగా.. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఈ ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి. ఇప్పుడు అనంతపురం దాహార్తిని హంద్రీ-నీవా కొంతమేర తీరుస్తుండగా, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల దాహార్తిని గాలేరు-నగరి తీరుస్తోంది. కర్నూలు జిల్లాలోని కొంత ప్రాంతానికి తెలుగు గంగ నీటిని అందిస్తోంది. తెలుగు గంగను మినహాయిస్తే. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. రాయలసీమ కరువును పూర్తిగానే తరిమేయవచ్చు. ఇక రాయలసీమ తలాపున వెళుతున్న కృష్ణా జలాల్లో ఆ ప్రాంతానికి నికర జలాల మాట ఎప్పుడైనా, ఏ నేత అయినా ప్రస్తావించారా? అంటే.. లేదనే చెప్పాలి. ఇప్పటిదాకా సీమ పేరెత్తితేనే అందరు నేతల నోట వినిపించే మిగులు జలాలు కాదు సీమకు కూడా నికర జలాలు కేటాయించాలంటూ టీడీపీ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లు నిజంగానే సీమ వాసుల్లో సరికొత్త ఆశలు చిగురింపజేసేవేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిగులు కాదు.. నికరం కావాలి
తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటన కోసం ఆదివారం నాడు అనంతపురం జిల్లా వచ్చిన బాలయ్య.. అక్కడ తెలుగు దేశం పార్టీ నిర్వహించిన ‘‘రాయలసీమ కృష్ణా జలాలు- హక్కులు, డిమాండ్లు రౌండ్ టేబుల్ సదస్సులో బాలయ్య పాలుపంచుకున్నారు. రాయలసీమ సమస్య ఏమిటన్న విషయాన్ని ఆయన విస్ఫష్టంగా చెప్పుకొచ్చారు. రాయలసీమకు జలాలిచ్చే ఉద్దేశ్యమే ప్రస్తుత ప్రభుత్వానికి లేదన్న బాలయ్య.. అసలు రాయలసీకే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా నీరు ఎలా ఇవ్వాలి? అందుకోసం ఎలాంటి ప్రణాళికలు రచించాలి? అన్న దిశగా జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బాలయ్య నిర్మోహమాటంగానే కుండబద్దలు కొట్టారు. సీమకు నీరు ఎలా ఇవ్వాలో తెలియని జగన్ సర్కారుకు.. సాగు నీటి రంగ నిపుణుల నుంచి గానీ, రాజకీయ పార్టీల నుంచి గానీ సలహాలు తీసుకునే ఉద్దేశ్యం కూడా లేదని తేల్చి పారేశారు. రాష్ట్రంలోని ఓ ప్రధాన ప్రాంతంగా, గతంలో రతనాల సీమగా వెలగిన రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని, నాలుగు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతానికి నిరక జలాలు ఎందుకు ఇవ్వరని బాలయ్య ప్రశ్నించారు. ఇకనైనా రాయలసీమకు కృష్ణా జలాల్లో నిరక జలాలను కేటాయించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను సాధించుకునేందుకు ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేయడానికి కూడా సిద్ధమని, సీమ యువత అందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలని తెలిపారు. నాడు రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, సీమ కోసం హంద్రీనీవా తీసుకువచ్చారని వివరించారు. కానీ హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులకు పుష్కలంగా నీరు అందించడంలేదని పేర్కొన్నారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.
కార్పొరేట్ కళ ఏది?
రాయలసీమ సమస్యలపై తనదైన శైలి స్పష్టతతో ఉన్న బాలయ్య.. సోమవారం రెండో రోజు కూడా హిందూపురంలో తన పర్యటనను కొనసాగించారు. ఈ సందర్భంగా హిందూపురం ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డులో క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది కొరత ఆసుపత్రికి శాపంగా మారిందన్నారు. సిటీ స్కానింగ్ పనిచేయకపోవడంతో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు గత టిడిపి ప్రభుత్వ హయాంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆస్పత్రికి తలదన్నేలా ఉండేదని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.











