మనకో సామెత ఉంది.. ఓడిన వాడు కోర్టులో ఏడుస్తాడు.. గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అని. నిర్మాత పరిస్థితి కూడా అచ్చు అలాంటిదే. గతంలో సినిమాలు తీసిన వారు ఎందుకు మళ్లీ సినిమాలు తీయడం లేదు అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానంలోనే జవాబు ఉంది. చేతిలో డబ్బున్న వాడు పేకాటలో కూర్చుంటాడు.. లేనివాడు ఆటకు రాలేడు.. నిర్మాత పరిస్థితి కూడా అంతే. అసలు నిర్మాత సినిమా ఎందుకు తీస్తాడు అనేది పెద్ద ప్రశ్న. దీనికి మూడు రకాల సమాధానాలు ఉంటాయి.
ఒకటి తొందరగా డబ్బు సంపాదించడం, రెండు పేరు ప్రతిష్ఠల కోసం, మూడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం కోసం. ఈ మూడింటిలో మొదటి దానికి కొందరు మొగ్గు చూపుతారు. మరికొందరు మిగతావి కోరుకుంటారు. ఈ మూడు కావాలని కోరుకునేవారు కూడా సినిమా రంగానికి వస్తారు. వచ్చి ఏంసాధించారు? అంటే ఏమీ ఉండదనే చెప్పాలి. సినిమా రంగంలో నిర్మాతకు ఇప్పుడున్న పేరు క్యాషియర్, బ్రోకర్.. ఇలా మరికొన్ని. ఎంతో గౌరవ ప్రదమైన ఈ వృత్తి ఇలా ఎందుకు మారిపోయింది? దీనికి కారకులు ఎవరు అంటే సమాధానం తెలిసి కూడా చెప్పలేని పరిస్థితి.
కేరాఫ్ అడ్రస్ లు ఎక్కువే..
సినిమా రంగంలో సినిమా కష్టాలు అనే మాట ఎక్కువగా ఉంటుందిగానీ సినిమా తీసేవారి కష్టాలు గురించి ఎవరూ మాట్లాడరు. 1931లో పుట్టిన తెలుగు సినిమా 90 ఏట అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో నిర్మాణ సంస్థలు వచ్చాయి, ఎందరో నిర్మాతలు వచ్చారు. పాతవారు వెళ్లిపోవడం, కొత్తవారు రావడం జరిగిపోతోంది. ఒకప్పుడు భారీ చిత్రాలు తీసిన పెద్ద నిర్మాణ సంస్థలు కూడా సినిమాలు తీసే ప్రయత్నాలు చేయకపోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. సినిమా రంగంలో ఉండే 24 క్రాఫ్ట్ ల వారినీ పోషించేది నిర్మాత మాత్రమే. ఒకప్పుడు మద్రాసు పాండీ బజారు గురించి కతలు కతలు గా చెప్పేవారు.. ఇప్పుడు కృష్ణానగర్ అలాంటిదే.
సినీ జనాలకు ఓ కేరాఫ్ అడ్రస్ ఉండాలి కాబట్టి ఏ మంగా టిఫిన్ సెంటర్ నో, గణపతి కాంప్లెక్స్ నో అడ్డాగా చేసుకుని అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈలోగా వయసు నాలుగు పదులు దాటేస్తుంది. పిల్లనిచ్చేవారు ఉండరు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కథలు వినిపించినా కనికరించే నిర్మాతలు ఉండరు. సినిమాలో నటించేవారు, కథలు రాసేవారు, దర్శకత్వం చేసేవారు ఉన్నంతగా నిర్మాతలు ఉండటం లేదు. మొహమాటానికి పోయి సినిమా తీస్తే అప్పులు మిగులుతున్నాయి.. దాన్ని బయటికి చెప్పుకోలేరు. ఫలానా సినిమా తీసింది నేనే అంటూ ఊళ్లో చెప్పుకునే బిల్డప్పులే మిగులుతాయి.
అప్పుచేసి తప్పటడుగులు
ఆ మధ్య నిర్మాతగా మారిన ఓ జర్నలిస్టు చనిపోతే ఆయన చుట్టూ అప్పులే ఉన్నాయన్న మాట వినిపించింది. ఆయన వెలిగినప్పుడు పంచన చేరిన వారు చనిపోయాక మొహం చాటేశారు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులు నానా తంటాలు పడ్డారు. అలాగే ఇటీవల మరో నిర్మాత చనిపోయారు. ఆయన కూడా పూర్వాశ్రమంలో జర్నలిస్టే. పైగా ఓ అగ్ర హీరోకు మేనేజర్ గానూ చేశారు. ఆయన తీసిన సినిమాలు బాగానే ఆడాయి. ఎక్కడ ‘మిస్’ ఫైర్ అయ్యిందో తెలియదుగానీ చనిపోయాక మాత్రం ఆయనకు 80 కోట్ల అప్పులు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఇవి బయటకు వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే.
కొందరు చెప్పుకుంటారు.. కొందరు చెప్పుకోరు. చెప్పుకుంటే కొత్త అప్పులు పుట్టవు. మరి నిర్మాతలు తెచ్చిన డబ్బంతా ఎక్కడికి పోతోంది? డబ్బు రానప్పుడు సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే. సినిమా తీయడానికి నిర్మాతలు ఎవరైనా వస్తే వారిని నాకేసే జనాలు కూడా ఎక్కువే. ఆ సినిమా విడుదలైతే చాలు ఉన్న ఆప్పులు తీర్చేసుకుని మళ్లీ సినిమా జోలికి రాకూడదనుకుంటారుగానీ ఆ సినిమా విడుదలయ్యేది ఎప్పుడో అప్పులు తీరేది ఎప్పుడో అర్థం కాదు. ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర అప్పులు చేసేస్తూ ఉంటారు. ఈలోగా టపా కట్టేయగానే నిండా మునిగిపోయాడన్న నగ్న సత్యం లోకానికి వెల్లడవుతుంది.
పక్కనే ఉంచుకుని భజన చేయించుకున్న హీరోగానీ, అడ్వాన్సులు తీసుకున్న దర్శకులుగానీ పత్తా ఉండరు. కనీసం కుటుంబ సభ్యులను పలకరించే దిక్కే ఉండదు. ఇన్ని సమస్యల్లో ఉన్న నిర్మాతలను ఇంకో పక్క కరోనా మహమ్మారి నిండా ముంచేసింది. తీసిన సినిమా విడుదల కావడమే గగనమైంది. తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోయి అది పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అయిపోయింది. బిల్డప్పు కోసం కొన్ ఫార్చూనర్ కారు అతని ఫార్చ్యూన్ ని ఏ మాత్రమూ మార్చలేదన్నది సినీ జగమెరిగిన సత్యం. నిర్మాతను దేవుడు అని పొగిడేవారేగానీ నిర్మాతలను ముంచేస్తున్న దయ్యాలను మాత్రం ఎవరూ దండించలేకపోతున్నారు. అందుకే నిర్మాతలు సినిమాలు తీయలేని రోజులు వచ్చేశాయి.











