తమ రాజకీయ భవిష్యత్ కోసం నేతలు పార్టీలు మారుతుంటారు. టిక్కెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి జంపవుతుంటారు. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కొంతమంది నేతలు ఆ పార్టీనే నమ్ముకొని ఉంటే, మరి కొంత మంది నేతలు మాత్రం.. టిక్కెట్ ఇవ్వకుంటే డ్రెస్సులు మార్చేసినంత ఈజీగా పార్టీ కండువాలు మార్చేస్తుంటారు.
హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ బలమైన నేత పార్టీ మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2018 ఎన్నికల నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రావడం పార్టీ మారబోతున్నాడనే ప్రచారానికి బలం చేకూరుతోంది. దీంతో ఆయన బీజేపీలో నిజంగానే చేరబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలను తీగల కృష్ణారెడ్డి ఖండించారు. ఏ పార్టీలోకి తాను చేరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ శివారులోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తీగల కృష్ణారెడ్డి గెలుపొందారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆయన టీఆర్ఎస్లోకి చేరారు. 2018లో మరోసారి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆమె కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో తీగలకు రాజకీయంగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. అయితే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ నగరం నుంచి ఏదోక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాలనే లక్ష్యాన్ని తీగల పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసమే అతను ఇతర పార్టీలవైపు తొంగి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్లో బలం పెంచుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని మాజీలను బీజేపీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే తీగలకు కూడా బీజేపీ గాలం వేసినట్లు చర్చ నడుస్తోంది. ముందస్తు షరతులు, ఒప్పందాలు, పార్టీలో తగిన చోటు లాంటి హామీలను గుప్పిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే తీగల కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీ వైపు తొంగిచూస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితా రెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఉన్నారు. మహేశ్వరం టీఆర్ఎస్ జడ్పీటీసీగా ఉన్న తీగల కోడలు ఆ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కొనవలసి వచ్చింది. తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్కు గుడ్‌బై చెబితే ఆయన కోడలు అనితారెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నిజంగానే తీగల పార్టీ మారితే గనుక జిల్లాలో బలమైన నేతను టీఆర్ఎస్ పార్టీ పోగట్టుకున్నట్టే లెక్క!