గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సన్నాహక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఎన్నికల ఓటర్ల తుదిజాబితా సిద్ధమవుతోంది. ఈనెల 13న ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. తుది జాబితా ప్రకటన తరువాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) పార్థసారథి మంగళవారం పేర్కొన్నారు.
అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈనెల 13 తరువాత తుది జాబితా ప్రకటించిన తరువాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈనెల చివరికల్లా నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కొత్త ఏడాదిలో కొత్త పాలకమండలి జీహెచ్ఎంసీలో కొలువుదీరేలా అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. బల్దియాలో మొత్తం 150 వార్డులున్నాయి. అయితే మొదటి నుంచి వార్డుల్లో మార్పులు, చేర్పులు జరగనున్నాయనే ప్రచారానికి ఎస్ఈసీ చెక్‌పెట్టింది. 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఒక్కో డివిజన్ పరిధిలో 50 వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను కూడా ఈ ఎన్నికల్లో ఉపయోగించనున్నారు.
పాత రిజర్వేషన్లే అమలు..
జనవరి కల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పూర్తిచేసేలా ఎన్నికల కమిషన్ ఆ మేరకు దృష్టి సారించింది. పాత రిజర్వేషన్లే అములులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన చట్టసవరణను కూడా ఈ మధ్యే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీ కాలం ఫిబ్రవరీలో పూర్తి కానుంది. పోలింగ్ నిర్వహణను నిర్ణీత గడువులోగానే పూర్తిచేస్తామని ఎన్నిక కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా ఎన్నికల ప్రక్రియపైనే దృష్టి సారించింది.