గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయపార్టీలు మినీ తెలంగాణ ఎన్నికలుగా భావిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే హడావుడీ, పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ మాదిరిగానే గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ తరహా పోటీ ఉంటుంది. హైదరాబాద్ మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల బరిలో పోటీ పడుతుంటాయి. ఈక్రమంలో నవంబర్ లేదా డిసెంబర్‌లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్నాయి. 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీకు 99 సీట్లు, ఎంఐఎంకు దాదాపు 44 కార్పొరేటర్లు ఉన్నారు.
అయితే ఈసారి అధికారపార్టీ 99 సంఖ్యకు తగ్గకుండా సెంచరీ కంటే ఎక్కువ సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని తెరాస నాయకత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరుస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు గులాబీ అధినాయకత్వం అప్పగించినట్లు తెలిసింది. గతంలోనూ ఆయా జిల్లాల ఎన్నికల బాధ్యతలు ఆ జిల్లా మంత్రులకే అప్పగించారు. పార్టీ అభ్యర్థి గెలుపుకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఆయా జిల్లాల మంత్రుల పర్యవేక్షణలోనే జరిగేలా ఉంటాయి. పార్టీ కాండిడేట్‌ను నిర్ణయించిన దగ్గరి నుంచి వారిని గెలిపించుకొని తెలంగాణ భవన్‌కు తీసుకువచ్చే బాధ్యత దాదాపు జిల్లా మంత్రులపైనే ఉండేది. ఇప్పుడు కూడా అటువంటి స్ట్రాటజీనే గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలుపర్చాలని నాయకత్వం భావిస్తుందట.
ఆ నలుగురు మంత్రులపైనే…
గ్రేటర్ హైదరాబాద్ నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హోం మినిస్టర్‌గా మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డిలు గ్రేటర్ నుంచి ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ నలుగురు మంత్రులపైనే జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతలను కెటిఆర్ పెట్టారట. ఈ ఎన్నికలు ఈ మంత్రులకు పెద్ద పరీక్షగా మారనున్నాయనే టాక్ వినబడుతోంది. గతంలోనూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల్లో బాధ్యతంతా మంత్రులదే అని గులాబీ బాస్ చెప్పారు. దాంతో ఆయా జిల్లా మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో చాలానే కష్టపడ్డారు. ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట.
బహుముఖ పోరు తప్పేలా లేదు!..
ఈసారి 150 డివిజన్లకు జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టేయాలని తెరాస భావిస్తుంది. దీంతో గ్రేటర్ బాధ్యతలను మంత్రులతోపాటు కొంతమంది పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో గులాబీ హవా వీయడంతో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను చిత్తుచేసి గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 99 డివిజన్లను కైవసం చేసుకుని మేయర్‌పీఠంపై గులాబీ జెండాను ఎగురవేసింది. కానీ టిఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న అనుకూలమైన వాతావరణం ఇప్పుడు లేదనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. మరీముఖ్యంగా గ్రేటర్‌లో. గ్రేటర్‌లో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందనే విమర్శలను ప్రతిపక్ష పార్టీలు గుప్పిస్తున్నాయి. దీనికి తోడూ ప్రజావ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీపై ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారనే భావన కనిపిస్తోంది.
ఈక్రమంలో ఈసారి గ్రేటర్ ఎన్నికల పోరు రసవత్తరంగానే జరగనుంది. అధికారపార్టీకి సర్వే ఫలితాలు సానుకూలంగా ఉన్నా, వాటిని ఆషామాషీగా ఆ పార్టీ నాయకత్వం తీసుకోవడంలేదు. టికెట్ల పంపిణీ, అభ్యర్థుల ట్రాక్‌రికార్డ్, డివిజన్లలో పార్టీ బలాబలాలు తదితర అంశాలను అంచనా వేస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మంత్రులపైనే పెడుతున్నారట. దీంతో ఇప్పటి నుంచే మంత్రులు ఎన్నికల పరీక్షలో బిజీబిజీగా గడుపుతున్నారు.
కేటిఆర్ డైరెక్షన్‌లో…
క్షేత్రస్థాయి బాధ్యతలను మంత్రులకు అప్పగించినప్పటికీ పైనుంచి కెటిఆర్ మంత్రులకు, నేతలకు డైరక్షన్ ఇస్తునే ఉన్నారట. ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలను అమలుపరచాలని మంత్రులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్ధేశం చేసి ముందుండి నడిపిస్తున్నారు. మంత్రులు, నేతలు, కార్పొరేటర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలను కెటిఆర్ నిర్వహిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో సానుకూలవాతావరణం ఉండేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పరీక్షలో మంత్రులు పాసవుతారో..లేదో చూడాలి మరి.