ఏపీ అసెంబ్లీలో కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రెండంకెలు దాటుతుందని, తలసరి ఆదాయం భారీగా పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు పేర్కొంది. వ్యవసాయ, అనుబంధరంగాలు, పారిశ్రామిక, సేవా తదితర రంగాల్లో వృద్ధి వల్లే ఈ పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మంచి వర్షాలు రావడంతో ఆహార ధాన్యల ఉత్పత్తి గతేడాది కన్నా అధికంగా ఉందని తెలిపింది. తయారీ, బ్యాంకింగ్, బీమా రంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు రూ.16.06 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆర్థిక సర్వే విశ్లేషించింది.
రాష్ట్ర తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల 68 వేల 653గా ఉంది. ఇది జాతీయ సగటు రూ.2 లక్షల 162 రూపాయల కంటే ఎక్కువ. ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా రూ. 94 వేల 967 కోట్లు, పన్నేతర రాబడుల నుంచి రూ. 7 వేల 18 కోట్లు, కేంద్రం నుంచి రూ.89 వేల 157 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పులు, ప్రజారుణం చెల్లింపులు పోనూ.. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,36,512 కోట్లు ఖర్చుచేయగా, 2024-25లో రూ.2,49,418 కోట్లు వ్యయం చేయనుంది. ఇక రాష్ట్ర అప్పు 2023-24 చివరి నాటికి రూ. 4 లక్షల 91 వేల 734 కోట్లుగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అది రూ. 5 లక్షల 64 వేల 488 కోట్లకు చేరనుంది. 2023-24లో రెవెన్యూ లోటు రూ.38,683 కోట్లు, ద్రవ్య లోటు రూ.62,720 కోట్లు కాగా, 2024-25 ఆఖరు నాటికి ఇవి వరుసగా రూ.48,311 కోట్లు, రూ.73,362 కోట్లు ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.
సాగు, ఉత్పత్తి రంగాలు భేష్!
రాష్ట్రంలో జూన్ నుంచి డిసెంబరు వరకు సగటు వర్షపాతం 860 మిల్లీమీటర్లు కాగా 2024లో ఈ కాలానికి 960.3 మిల్లీ మీటర్ల కురిసింది. అంటే 11.7% అదనపు వర్షపాతం నమోదైంది. ఆహార పంటల సాగు పెరిగింది. 2023-24లో 33.24 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా, ఈ ఏడాది 37.51 లక్షల హెక్టార్లలో సాగైంది. 12.85% వృద్ధి నమోదైంది. గతేడాది 143.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాగా, ఈ ఏడాది 161.86 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 127.15 లక్షల టన్నులు రావొచ్చని అంచనా. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 12.95 శాతం అధికం. 18.23 లక్షల హెక్టార్లలో సాగవుతున్న పండ్ల తోటలతో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అత్యధిక వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వడ్డీలేని రుణాలు, మౌలిక సౌకర్యాల మెరుగుదల, రాయితీపై విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ, పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025 జనవరి నాటికి 9 లక్షల 13 వేల 283 మంది కౌలురైతులకు ఈ-కార్డులు అందించగా, వారిలో 2 లక్షల మందికి రూ.2 వేల 848 కోట్ల రుణాలు ఇప్పించింది.
ఇక ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి సారించింది. 2024-25లో ఉల్లిపాయల ధరలు 40.24% పెరగ్గా, ప్రభుత్వం కల్పించుకొని నేరుగా రైతుల నుంచి సేకరించింది. గిడ్డంగుల్లో నిల్వచేసి, ప్రజలకు చౌక ధరకే అందేలా చూసింది. వ్యవసాయ కూలీలు, పరిశ్రమల కార్మికులకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో వృద్ధి నమోదైంది. పరిశ్రమల కార్మికుల సూచీ 4.89% పెరగ్గా, వ్యవసాయ కూలీలకు సంబంధించి 5.93% వృద్ధి చెందింది. వ్యవసాయ కార్మికుల (పురుషులు) రోజువారీ సగటు వేతనం రూ.561తో 5.65% వృద్ధి కనబరిచింది. మహిళా కూలీల సగటు వేతనం రూ.398తో 2.58% వృద్ధి ఉంది. వడ్రంగులు, స్వర్ణకారుల వేతనాల్లోనూ వేగవంతమైన వృద్ధి ఉంది. కార్పెంటర్ల రోజువారీ సగటు వేతనం 7.74% వృద్ధితో రూ.710గా నమోదైంది. చర్మకారుల వేతనాల్లో స్వల్ప తగ్గుదల ఉంది. ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తోంది. కోటి 48 లక్షల మందికి రాయితీపై బియ్యం, తదితరాలు అందిస్తోంది. దీపం-2 పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లు ఇస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.16.06 లక్షల కోట్ల మేర సాధ్యం కానుంది. గతేడాది (2023-24)తో పోలిస్తే 12.94% వృద్ధి సాధ్యమవుతుందని సర్వే అంచనా వేసింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల సమతుల పురోగతి ఇందుకు కారణమని సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయ రంగం రూ.5.19 లక్షల కోట్ల అదనపు స్థూల విలువను జోడిస్తోంది. సాగులో 15.86%, మత్స్య రంగంలో 16% వృద్ధి రేటు ఉంది. పారిశ్రామిక రంగం రూ.3.41 లక్షల కోట్ల స్థూల అదనపు విలువ జోడిస్తూ 6.71% వృద్ధి కనబరుస్తోంది. తయారీ రంగంలో 6.57%, నిర్మాణ రంగంలో 10.47% వృద్ధి ఉంది. సేవల రంగం 11.70% వృద్ధితో రూ.6.11 లక్షల కోట్ల స్థూల అదనపు విలువను జోడించనుంది. కమ్యూనికేషన్ 15.28%, బ్యాంకింగ్, బీమా రంగాలు 14.61% వృద్ధి కనబరుస్తున్నాయి. మొత్తంగా ఐదేళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్న కూటమి సర్కార్‌కు అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి.