మహానటి కీర్తి సురేష్ సినిమా సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమా నాదంటే నాదంటూ ఇద్దరు నిర్మితలు కొట్టాడుకునేదాకా పరిస్థితి వెళ్లింది. ఇంతకీ ఇది ఎవరి సినిమా అనేది ఎవరు తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింంది. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రం ‘ఐనా ఇష్టంనువ్వు’. ఈ సినిమా పేరును ‘జానకితో నేను’ అని మార్చినట్లు నిర్మాత అడ్డాల చంటి ప్రకటించారు. ఈ సినిమాకి ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇది ‘జానకితో నేను’ కాదు ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమానే అని నిర్మాత నట్టి కుమార్ ముందుకొచ్చారు. ఒకే రోజు ఈ ఇద్దరు నిర్మాతలూ ఈ సినిమాకు సంబంధించి రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. నట్టిస్ఎం టర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మించినట్లుగానూ, ఈ చిత్రాన్ని చంటి అడ్డాల తమకు అమ్మేసినట్లుగా చెబుతున్నారు నిర్మాత నట్టికుమార్. ఈ సనిమాని తమకు అమ్మినట్లు బాండ్ పేపర్లు, సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయినా కూడా అదనపు డబ్బు కోసం నిర్మాత చంటి అడ్డాల తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేది నిర్మాత నట్టి కుమార్ ఆరోపణ.
దీని మీద అడ్డాల చంటి ఇంకా స్పందించలేదు. రాహుల్ దేవ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుందని, కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఈ సినిమాను అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు నట్టికుమార్ చెబుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై తానే ఈ సినిమాని నిర్మించానని, ఇందులో నాగబాబు కీలక పాత్రలో నటించారని అడ్డాల చంటి చెబుతున్నారు. నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని, త్వరలో దానిని కీర్తిసురేష్ పై చిత్రీకరిస్తామని ఆయన వివరించారు. థియేటర్స్ ఓపెన్ కాగానే సినిమాని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు నటించారు.
ఇంతకీ విషయమేమిటంటే ఈ సినిమా కీర్తి సురేష్ సినిమా రంగంలో ప్రవేశించిన తొలినాళ్లది. అడ్డాల చంటి దీన్ని నిర్మించిన మాట నిజమే. కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కీర్తి సురేష్ కు స్టార్ డమ్ వచ్చింది. నిజానికి ఈ సినిమా కరోనాకు ముందే విడుదల కావాలి. కాకపోతే అడ్డాల చంటికి, నట్టి కుమార్ కు మధ్య ఆర్థిక లావాదేవీలలో తేడా వచ్చింది. పైగా కీర్తి సురేష్ కు క్రేజ్ ఉంది కాబట్టి అడ్డాల చంటి అదనంగా డబ్బును డిమాండు చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇప్పుడు ఈ సినిమాకి రెండు పేర్లు వచ్చాయి. ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.











