డ్రగ్స్ వ్యవహారం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో అర్థంగావడం లేదు. ఓ పక్క రియా, ఇంకో పక్క కంగనా… ఒకరు అందులో కూరుకుపోతే, ఇంకొకరు డ్రగ్స్ పేరుతో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముంబయిలోని తన కార్యాలయాన్ని బీఎంసీ కూలగొట్టే ప్రయత్నం చేసినా కంగన ఏమాత్రమూ వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేనే టార్గెట్ చేసింది. అతనికి డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయని ఈరోజు బాంబు పేల్చింది. ఈరోజు ముంబయి నుంచి తిరిగి వెళ్లి పోతూ బరువెక్కిన గుండెతో ముంబయి వదులుతున్నా అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఐదు రోజులుగా ముంబయిలోనే…
తన కార్యాలయాన్ని కూలగొట్టే రోజు ఆమె ముంబయిలో అడుగుపెట్టింది. దాదాపు ఐదు రోజులు అక్కడే గడిపింది. ఈరోజు తన స్వస్థలమైన మనాలికి బయలుదేరి వెళ్లింది. ముంబయిలో ఉన్నన్ని రోజులూ తాను భయంతోనే గడిపానని ఆమె పేర్కొంది. ఇక్కడ తనను ఎన్ని భయభ్రాంతులకు గురి చేశారో , ఎన్ని దుర్భాషలాడారో, ఎంతగా తన ఆఫీస్ ను ధ్వంసం చేశారో చూస్తే తాను చేసిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న వ్యాఖ్యలు కరెక్టే అనిపిస్తుందని ఆమె పేర్కొంది. శివసేనకు, కంగనాకు మధ్య తలెత్తిన ఇంకా ఎటు దారితీస్తుందో అర్థంకావడం లేదు.
ఈ చర్యల ద్వారా తనను మరింత రెచ్చగొడుతున్నారని, వారి నిజస్వరూపాలను బయటపెడతానని ఆమె హెచ్చరించారు. సుశాంత్ కేసులో తన పేరు ప్రస్తావించడంపై ఆదిత్య థాకరే మండిపడుతున్నారు. సినీ ప్రముఖులతో తనకు సంబంధాలు ఉండటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ ఆరోపణలు రావడంపై ఆదిత్య ఏమంటారో చూడాలి. మరో పక్క రియా డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఎన్సీబీ నుంచి చాలామందికి సమన్లు వెళ్లాయి. అందులో ముఖ్యంగా తెలుగు హీరోయిన్ రకుల్ పేరు కూడా ఉంది. క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రకుల్ ప్రస్తుతం షూటింగుకు రావడం లేదని తెలుస్తోంది. దీనిపై ఇంతవరకు ఆమె స్పందించలేదు.











