ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు గ్రాడ్యూయెట్ స్థానాలతో పాటు ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీతో పాటు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఐతే ఏపీలో ఐతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై పల్స్ టుడే సర్వే సంస్థ సంచలన సర్వేను రిలీజ్ చేసింది.
కృష్ణా – గుంటూరు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 30 మంది బరిలో ఉండగా ప్రధానంగా ఇద్దరు అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, PDF అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణ రావు మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఐతే కె.ఎస్.లక్ష్మణరావు తీవ్రమైన పోటీ ఇస్తున్నప్పటికీ..ఆయన రెండో స్థానానికి పరిమితమవుతారని పల్స్ టుడే అంచనా వేసింది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధిస్తారని సర్వే ఫలితాలు వెల్లడించింది.
ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 35 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే నెలకొంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్,PDF అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు నువ్వా, నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఈ స్థానంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు జి.వి. సుందర్ కూడా పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల్లో కూటమి ప్రభుత్వంపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ..పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించబోతున్నారని పల్స్ టుడే సర్వే అంచనా వేసింది.
ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు. ఐతే ముగ్గురి మధ్య మాత్రమే పోటీ నెలకొంది. ఇక్కడ APTF అభ్యర్థి పాకలపాటి రఘువర్మను కూటమి ప్రభుత్వం బలపరచగా…మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, PDF అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి హోరాహోరీ తలపడుతున్నారు. ఐతే త్రిముఖ పోరులో కూటమి బలపరిచిన APTF అభ్యర్థి పాకలపాటి రఘువర్మ విజయఢంకా మోగిస్తారని పల్స్ టుడే అంచనా వేసింది.
ఇక తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నాయి. రెండు టీచర్స్ స్థానాలతో పాటు ఓ గ్రాడ్యూయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఐతే ఇక్కడ రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధిస్తుండగా..ఆదిలాబాద్, కరీంనగర్,మెదక్,నిజామాబాద్ టీచర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధిస్తారని పల్స్ టుడే అంచనా వేసింది.











