TDP అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన నేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్టయిన వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. BNS చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసాని మార్చి 12 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళిని కడప కేంద్రకారాగానికి తరలించే అవకాశం ఉంది.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట మాజీ సర్పంచ్, జనసేన నేత జోగినేని మణిఈ నెల 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని పోసాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఈ నెల 26 అంటే బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు.
ఇక పోలీసుల ముందు తాను తప్పు చేశానని పోసాని అంగీకరించినట్లు సమాచారం. మీరు చూపించిన రికార్డుల్లోని బూతులు నావేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తాను లోకేష్, చంద్రబాబులపై అలా మాట్లాడి ఉండకూడదని, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముందు చెప్పినట్లు సమాచారం. తాను చెప్పుడు మాటలు విన్నానని, తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకూ వస్తుందని ఊహించలేదని పోసాని చెప్పినట్లు తెలుస్తోంది.
2019కి ముందునుంచే పోసాని వైసీపీకి మద్దతిస్తూ వచ్చారు. ఐతే ఆ సమయంలో నోటికి పని చెప్పిన ఆయన చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌పై ఇష్టారీతిన మాట్లాడారు. ఐతే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పోసానికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది వైసీపీ. ఐతే పదవి వచ్చిన తర్వాత కూడా పోసాని హుందాగా ప్రవర్తించలేదు. బూతులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఐతే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న వైసీపీ మాటలకు…ఈ వీడియోలను చూపిస్తున్నారు కూటమి నేతలు. చెప్పలేని రీతిలో పోసాని మాట్లాడిన మాటలను వైసీపీ సమర్థిస్తోందా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఫ్యాన్ పార్టీ నేతల నోటి నుంచి మాటలు రావడం లేదు.











