వైసీపీ నేత, ఏపీ మాజీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. రాయదుర్గంలోని మైహోం భుజాలో పోసానిని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ షెల్టర్ తీసుకున్న మైహోం భుజాలోనే పోసాని సైతం నివాసం ఉంటున్నారు. పోసాని ఆచూకీ తెలియడంతో బుధవారం రాత్రి నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినప్పటికీ..ఆయన బనియన్, బాక్సర్ మీదనే పోలీసులతో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనను ప్రస్తుతం ఏపీకి తరలించారు.
వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళీ…అప్పటి ప్రతిపక్ష నేతలైనా చంద్రబాబు,లోకేష్, పవన్‌కల్యాణ్‌పై రెచ్చిపోయారు. మహిళలై అసభ్య పదజాలం, బూతులతో విరుచుకుపడేవారు. ఐతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఏపీలో పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌పై అసభ్య పదజాలం వాడాలని, ప్రజల్లో వర్గ విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత నవంబరులో పశ్చాత్తాపం ప్రకటించారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని, రాజకీయాలకు ముగింపు పలుకుతున్నానని ప్రకటించారు.
చిత్ర పరిశ్రమలో విబేధాలు సృష్టించేలా ప్రయత్నించారని, డిప్యూటీ సీఎం, జనసేన నేత పవన్‌కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేనకు చెందిన జోగినేని మణి రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై BNS 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజంపేట కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు.
వైసీపీ హయాంలో పోసానిని ఆ పార్టీ ప్రోత్సహించింది. తెలుగుదేశం, టీడీపీపై బూతులతో విరుచుకుపడ్డ పోసానికి అప్పట్లో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని బహుమతిగా కట్టబెట్టింది. ఆ పదవి వచ్చిన తర్వాత కూడా పోసాని నోరు అదుపులో పెట్టుకోలేదు. చెప్పలేని బూతులతో రెచ్చిపోయారు. మహిళలను కూడా వదల్లేదు. పోసాని అరెస్టుతో లోకేష్ రెడ్‌బుక్కులో మరో పేజీ చిరిగినట్లయింది. నెక్ట్స్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ లిస్టులో RGV, శ్రీరెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు గతంలో టీడీపీ నేతలపై రెచ్చిపోయిన ఇద్దరు, ముగ్గురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.











