విలక్షణ పాత్రలకు మోహన్ బాబు పెట్టింది పేరు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగల సమర్థత ఆయన సొంతం. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే ఆయన రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మోహన్ బాబును టీడీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. చంద్రబాబుతో తీవ్ర విభేదాలు రావడంతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పడమే గాక ఫీజు రీఎంబరస్మెంట్ విషయంలో అప్పటి ప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెట్టాడు. తాజాగా ఓ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలలో తాను ఎదగపోవడానికి ఓ వ్యక్తి కారణమంటూ విరుచుకుపడ్డాడు.
ఒకడు నన్ను నమ్మించి మోసం చేయడం వల్లే నా రాజకీయ జీవితం నాశనం అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ వ్యక్తి కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశామని తెలిపిన మోహన్ బాబు ఆ వ్యక్తి తనను మోసం చేసి బిజినెస్ లాకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి గురించి ఇంకా మాట్లాడాలని ఉన్నా చచ్చిన పామును ఇంకా కొట్టకూడదనే ఉద్దేశంతో అతడిని వదిలేసినట్లు తెలిపారు. చాలా మంది తనదగ్గరికి వచ్చి రాజీ పడమని చెప్పారని కాని కోట్లాది సంస్థ నుంచి తనను బయటికి పంపిన ఆ వ్యక్తిని తాను మరిచిపోలేనని వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందంటూ ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు.
ప్రధాని అంటే తనకు ఎంతో ఇష్టమని మరోమారు స్పష్టం చేసిన ఆయన తనను మోడీ ‘బడే బాయ్’ అని పిలుస్తారని తెలిపారు. ప్రధాని కాకముందే మోడీతో తనకు అనుబంధం ఉండేదని కొత్త విషయాన్ని తెలియచేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోడీ పరిపాలన అద్భుతంగా ఉండటంతో ఆయనను పలుమార్లు కలిశానని చెప్పుకొచ్చారు. మోడీని ఎప్పుడూ కలిసినా తమ మధ్య రాజకీయాలు చర్చకు రావని స్పష్టం చేశారు. మోడీని ‘కాకా’ పట్టడానికే తాను కలిశానని వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తులు మూర్కులు అంటూ అభిప్రాయపడ్డారు. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో శ్రీవిద్యానికేతన్ ను తాను స్థాపించలేదని మరోమారు స్పష్టం చేశారు.
సినిమాలలో సంపాదించింది మొత్తం కళాశాలలో పెట్టినట్లు ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంపై నానా యాగీ చేసిన మీరు జగన్ ప్రభుత్వం విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయనకు ఓ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కొంచం ఇబ్బంది పడ్డ ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రావలసిన బకాయిలు రావడం లేదని తెలిపారు. కొన్ని రోజుల కిందట జగన్ ను కలిసిన విష్ణు ఈ విషయం గురించి అడిగారని చెప్పారు. త్వరలోనే ఇస్తామని జగన్ చెప్పాడని వెల్లడించారు. ఇంటి మీద బ్యాంకులో లోన్ తీసుకొని పని చేసే వారికి జీతాలు ఇచ్చినట్లు ఆయన తన ఆవేదనను తెలిపారు. సినిమా అవకాశాలు వస్తున్నా తాను సంవత్సరానికి ఒక్క సినిమా చేయాలని ఆలోచనగా ఉందని అన్నారు.