Telangana Minister Gangula Kamalakar Calls Chandrababu Naidu as Telangana CM Instead of KCR :
నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలెట్టి.. ఆ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించడంతో పాటుగా తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎంగా, పదేళ్ల పాటు విపక్ష నేతగా వ్యవహరించారు. ఈ తరహాలో ఇంతకాలం పాటు క్రియాశీలంగా వ్యవహరించిన నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే కాబోలు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయినా..చంద్రబాబు ఏపీకి సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేసి, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా.. అంటే తెలంగాణ ఆవల నుంచే ఆయన రాజకీయాలు నడిపిస్తున్నా.. తెలంగాణ రాజకీయ నేతలు తమ రాష్ట్రానికి కూడా చంద్రబాబే సీఎం అన్న భావనలో ఉండిపోయారు. ఈ భావనతో ఉన్న నేత.. ఏ చోటామోటా నేతో అయితే ఫరవా లేదు గానీ.. నిత్యం చంద్రబాబుపై, ఆయన పార్టీపై తనదైన శైలి విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత, కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ ఈ దిశగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటుగానే గంగుల ఈ వ్యాఖ్యలు చేసినా.. ఆయన మనసులో చంద్రబాబు రూపం ఎంత బలంగా ముద్ర పడకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు చెప్పండి.
గెలుపు బాధ్యత గంగులదే
అసలే హుజూరాబాద్ ఉప ఎన్నిక తరుముకొస్తోంది. అధికార పార్టీకి రాజీనామా చేసి.. దానితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉప ఎన్నికకు సై అన్నారు కదా. మరి ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పొరపాటున ఓడితే కేసీఆర్ పరువు పోతుంది. అందుకే.. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే.. అక్కడ గంగులను టీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దించింది. గంగులకు తోడుగా హరీశ్ రావుతో కూడిన మంత్రుల బృందాన్ని కూడా జోడించింది. ఇక హుజూరాబాద్ అభివృద్ధికి నిధులైతే వరదై పారుతున్నాయి. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో గంగుల ఓ రకమైన యాంగ్ఝైటీలో పడిపోయారని చెప్పాలి. పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తెలియనప్పటికీ.. పార్టీని గెలుపు తీరం చేర్చాల్సిందేనన్న కోణంలో గంగుల శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు.
Gangula Kamalakar :
ముందు చంద్రబాబు.. తర్వాత కేసీఆర్
ఈ క్రమంలో శనివారం హుజూరాబాద్ పరిధిలో పర్యటించిన సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అనబోయి.. పొరపాటుగా చంద్రబాబు అనేశారు. ఈ సందర్భంగా గంగుల ఏమన్నారంటే.. మంచి పధకాలు తెచ్చిన చంద్రబాబుకు దీవెనలు ఇవ్వాలా వాద్దా.. ఆయన కడుపు చల్లాగా ఉండాలని కోరుకోవాలా? వద్దా? అంటూ తనదైన ఫ్లోలో చెప్పుకుంటూ పోయారు. అయితే ఏమాత్రం ఆలస్యం లేకుండానే తన నోట నుంచి వచ్చిన పొరపాటును గ్రహించిన గంగుల.. చంద్రబాబు ప్లేస్ లో కేసీఆర్ అంటూ మాట మార్చేశారు. మాట మార్చినా.. గంగుల మనసులో తెలంగాణకు సీఎంగా చంద్రబాబే ఉన్నారని, అయినా చంద్రబాబును ఈ టీఆర్ఎస్ నేతలు ఎప్పటికీ మరిచిపోరని, ఆయన పాలనను గుర్తు చేసుకుంటూనే ఉంటారన్న దిశగా ఆసక్తికర సెటైర్లు పడిపోతున్నాయి.