వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోరుకు నల్గొండ కోర్టు అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ లో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినా వర్మ మాత్రం అప్రతిహతంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మిర్యాలగూడ ‘ప్రణయ్’ హత్య కేసు నేపథ్యంలో వర్మ ‘మర్డర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తండ్రి-కూతురు మధ్య గొప్ప అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. వాస్తవాలను వక్రీకరించారనే ఉద్దేశంతో అమృత కోర్టులో ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన నల్గొండ కోర్ట్ సినిమా విడుదలకు అడ్డుకట్ట వేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ సినిమాను విడుదల చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. మిర్యాలగూడకు చెందిన బిజినెస్ మ్యాన్ మారుతీరావు తనయ అమృత ప్రేమించి ప్రణయ్ అనే యువకుడిని వివాహమాడింది. తమ కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో మారుతీరావు తన అల్లుడిని సుపారి ఇచ్చి హత్య చేయించాడు. ‘హానర్ కిల్లింగ్’ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో మారుతీరావును అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైలులో ఉన్న ఆయన బెయిల్ పై బయటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.











