ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ఎక్కడ బహిరంగ సభలకు వెళ్లినా, ఏ కార్యక్రమాలకు వెళ్లినా అత్యంత బందోబస్తుతో వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రోటోకాల్ ప్రకారం ఉండే వ్యక్తిగత సెక్యురిటీ కాకుండా.. ఆయన రోడ్డుపై వెళ్లే మార్గం మొత్తం రహదారికి ఇరువైపులా పరదాలు కట్టేయడం.. జనం రాకుండా బారీకేడ్లు పెట్టేయడం వంటి ఘటనలు ఉంటున్నాయి. కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ ఇలాంటి విధానాన్నే అనుసరిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని తన సొంత నిఘా టీమ్ చెప్పడంతో ఎవరూ నిరసనలు చేయడానికి ముందుకు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, రాష్ట్రమంతా ఇలా చేస్తున్నారంటే అర్థం ఉంది కానీ.. జగన్ సొంత నియోజకవర్గంలోనూ ఆ పరదాల మధ్యలోనే జగన్ వెళ్తుండడం.. మరీ ఆశ్చర్యాన్ని కలిగింది.
ఇలా సొంత గడ్డపైన కూడా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నిరసన సెగ తప్పలేదు. నా సొంత మనుషులు అనుకున్న వ్యక్తుల నుంచే జగన్ కు షాక్ లు తగిలాయి. ఇటీవల పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఎప్పుడూ లేనట్లుగా ఎదురు స్వరాలు, ప్రశ్నలు జగన్ విన్నారు. దీంతో ఆయనకు దిమ్మతిరిగిపోయినట్లు తెలుస్తోంది. ‘ఏందన్నా నాతో కొట్లాటకు వచ్చినారా ఏమీ?’ అని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పర్యటనలో ఉన్నవారు చెబుతున్నారు.
పులివెందుల వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు అక్కడ కూడా ఆ కంచుకోటకు బీటలు వస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు బయటికి వస్తుండడం.. స్థానికంగా టీడీపీకి ఆదరణ పెరుగుతుండడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభ ఘోరంగా తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం జగన్మోహన్ రెడ్డి తన సొంత మండలం అయిన సింహాద్రిపురంలోని గ్రామ సర్పంచ్‌లు ఇతర దిగువస్థాయి నేతలో సమావేశం ఏర్పాటు చేయించుకున్నారు. వారందరినీ ఇడుపులపాయలో కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సదరు పార్టీ నేతలు జగన్ ను సూటిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా అధికారంలో ఉండి తమకు ఏంచేశావ్ అన్నా.. అంటూ జగన్ ను వారు నిలదీసినట్లు సమాచారం.
గత ఎన్నికలకు ముందు తాము లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేశామని, ఈ ఐదేళ్లలో పెండింగ్ బిల్లులు కాక వివిధ పనులు కూడా ఆగిపోయానని వారు జగన్ కు చెప్పారు. తమ సొంత జేబులోంచి పెట్టిన డబ్బులు కూడా తమకు వచ్చే పరిస్థితి లేదని వారు జగన్ ను నిలదీసినట్లు సమాచారం. ఇలాగైతే వచ్చే 3 నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం తమకు ఓటు వేయండని ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలో చెప్పాలని జగన్ ను ముఖం మీదే అడిగేసినట్లు తెలుస్తోంది. దాంతో జగన్ తాను అధికారులకు చెప్తానని దాటవేత ధోరణి ప్రదర్శించారు. అయినా నేతలు వినకపోవడంతో.. అప్పటికి అన్నీ సర్దుకుంటాయని.. నేనున్నా కదన్నా అంటూ వారిని సముదాయించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్‌కు సొంత గడ్డ మీదే ఇలా ఊహించని షాక్ ఇవ్వడంతో ఆయనకు పులివెందుల కూడా చేజారిపోయే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.