‘చిత్రం, జయం, నువ్వునేను’ లాంటి సినిమాలకు ఆర్పీ మ్యూజిక్, తేజ దర్శకత్వపు మ్యాజిక్ కలిసి టాలీవుడ్ లో సెన్సేషన్ అయింది. వీరి కాంబినేషన్ లో మరెన్నో మ్యూజికల్ ఆల్బమ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరూ తెరమరుగయ్యారు. ఆర్పీ దర్శకత్వంలోకి ప్రవేశించి.. అందులో సక్సెస్ సాధించలేకపోయారు. అయితే తేజ మాత్రం మొన్నామధ్య రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే మూవీతో తిరిగి సక్సెస్ అందుకున్నారు.
చివరిగా ఆర్పీ పట్నాయక్ 2005లో తేజ దర్శకత్వంలో రూపొందిన ‘అవునన్నా కాదన్నా’ అనే సినిమాకి సంగీతం అందించారు. ఆ తర్వాత వీరి కాంబో మళ్ళీ కలవలేదు. ఇంత కాలానికి ఇప్పుడు మరోసారి ఈ జోడీ ఓ సినిమా కోసం కలిసి పనిచేయబోతుండడం విశేషంగా మారింది. ఆ సినిమా పేరు చిత్రం 1.1.
దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారంటే…. మరోసారి సంగీత ప్రభంజనం ఖాయమని అర్ధమవుతోంది. ఈ సినిమా లోని పాటలు గానీ హిట్టైతే.. తిరిగి ఆర్పీ టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. మరి ఆర్పీ పట్నాయక్ చిత్రం 1.1 సినిమాతో సంగీత దర్శకుడిగా తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.











