ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఇంకా దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది దీని బారిన పడి బలైపోయారు. మరెందరో కరోనా సోకి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. వాటిలో సినీ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో జనంలో మంచి పేరు తెచ్చుకున్న ‘మనం సైతం’ ఒకటి. ఈ సంస్థ కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంది. ఎంతోమంది పేదలకు ఆర్ధిక సహాయం అందిస్తూనే .. వారికి నిత్యావరస వస్తువుల్ని కూడా సమకూరుస్తోంది.
రీసెంట్ గా చిత్రపురి కోలనీలో ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులకు అండగా నిలబడేందుకు ‘మనం సైతం’ ముందుకొచ్చింది. వారందరికీ ఉచితంగా భోజన సదుపాయం, మందుల కిట్స్, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సిజన్ సిలెండర్స్ అందించారు. బాధితులు ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోడానికి ఆక్సీ మీటర్స్ కూడా అందించారు. ఈ సేవా కార్యక్రమానికి చిత్రపురి కోలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, రుద్రరాజు రమేశ్ తదితర టీమ్ సభ్యులు చేయూతనందించారు.
కరోనా టైమ్ లో తమ సేవాకార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి సాయం అందించామని, కోవిడ్ పేషెంట్ప్ కు ఎంతగానో సాయం చేశామని.. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మా మనం సైతం సిద్ధం గా ఉంటుందని కాదంబరి కిరణ్ చెప్పారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు మనం సైతం సేవా కార్యక్రమాల్ని ప్రశంసిస్తున్నారు.











