సీఐడీ కస్టడీలో ఉన్న తనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపిన సంగతి తెలిసిందే. తన కాళ్లను తాళ్లతో కట్టేసి… అరికాళ్లపై కర్రలు, ఫైబర్ లాఠీలతో కొట్టారని తెలిపారు. గాయాలతో కమిలిపోయి ఉన్న పాదాలను జడ్జికి చూపించారు. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏపీ అంతటా తీవ్ర చర్చకు నడుస్తోంది. ప్రతిపక్షాలు సైతం ఇదేంటి? అని ప్రశ్నిస్తున్నాయి. కరోనా వేళ.. ఈ రాజకీయాలు అవసరమా..అని సామాన్యులు సైతం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
శరీరం దెబ్బలు ఎలా వచ్చాయి?
తాజాగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ఎంపీ పైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో నియంత పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రశ్నిస్తే ఎవరిపైనైనా కుట్రలు చేయడానికి ప్రభుత్వం వెనుకాడటం లేదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు శరీరంపై దెబ్బలెలా వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారులను స్వప్రయోజనాలకు వాడుకుంటూ పోతే, ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. రఘురామరాజు నిజాలు మాట్లాడుతూ, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నందునే ఆయనను అరెస్ట్ చేశారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.