మెగా మేనల్లుగు సాయిధరమ్ తేజ్ మళ్లీ తెరమీదకు వచ్చేస్తున్నాడు. కొంతకాలం క్రితం బైక్ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఆస్పత్రిలో ఉండగానే రిపబ్లిక్ సినిమా విడుదలైంది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆయన కోలుకున్న తర్వాత కమిట్ అయిన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి విరూపాక్ష అనే టైటిల్ నిర్ణయించారు. ఈ రోజు అధికారికంగా టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరించారు. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి కొత్త జానర్ కథను సాయిధరమ్ ఎంపిక చేసుకున్నారు.
ఇక గ్లింప్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ వాయిస్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘అజ్ఞానం భయానికి మూలం..భయం మూఢ నమ్మకానికి కారణం. ఆనమ్మకమే నిజమైనప్పుడు..ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్నిచూపించే మరో నేత్రం విరూపాక్ష’ అనే ఈ వాయిస్ కథ మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా కార్తీక్ దండు పరిచయమవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన కథ ఇది. సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దండు తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం.
ప్యాన్ ఇండియా ప్రాజెక్టులా ఈ చిత్రం ఐదు భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్. అజినీష్ లోక్ నాథ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ చూస్తే ఎక్కువగా రాత్రి పూటే షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది. సుకుమార్ స్క్రీన్ ప్లేతో రూపొందే సినిమా కాబట్టి సాయిధరమ్ కు మళ్లీ మంచి హిట్ పడినట్టుగానే భావించాలి. ఒక ఊరిలో వరుస మరణాలు సంభవించడం, వాటికి కారణాలు ఏంటో తెలుసుకోడానికి హీరో ఆ ఊరికి వెళితే అక్కడ అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నదే ప్రధాన కథ అని తెలుస్తోంది.