అవతార్ – ద వే ఆఫ్ వాటర్… ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎందుకంటే ఈ సినిమా ఈ నెల 16నే విడుదల కాబోతోంది మరి. అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకింత క్రేజ్. ఈ ఫ్రాంఛైజీలో మొత్తం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. 2009 డిసెంబరు 18న అవతార్ విడుదలైంది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించడమే ఈ ప్రాజెక్టుకు ఇంత క్రేజ్ రావడానికి కారణం.
టెర్మినేటర్, టైటానిక్ లాంటి సినిమాలు అతని నుంచి రావడంతో పాటు అప్పట్లో వచ్చిన అవతార్ తో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారాయన. తాజాగా అవతార్ – ది వే ఆఫ్ వాటర్ పేరుతో రెండో భాగాన్ని ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఫేషియల్ మోషన్ క్యాప్చర్ విధానంలో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఇది ఓ కొత్త సాంకేతిక విప్లవం. కొత్త కెమెరా విధానంతో రూపొందిన చిత్రమిది. దీనికి గ్రీన్ మ్యాట్, బ్లూమ్యాట్ లాంటివి అవసరం లేదు. అధునాతన కెమెరా లెన్స్ లే ఈ విధానానికి కీలకం. వర్చువల్ స్టేజ్‌లో షూటింగ్ చేయడం ద్వారా ఇలాంటి చిత్రాలను రూపొందిస్తారు. మన ఇండియాకి ఇంకా ఈ టెక్నాలజీ రాలేదు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ తరహా సెటప్ ఏర్పాటవుతున్నట్టు సమాచారం. ఆ స్టూడియోలోని ఓ ఫ్లోర్ లో ఇలాంటి కెమెరా సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక అవతార్ విషయానికి వస్తే అత్యంత సుదీర్ఘకాలం షూట్ చేసిన సినిమాగానూ చెప్పాల్సి ఉంటుంది.
ఆస్కార్ అవార్డు పొందిన వెల్లంగ్ టన్ వెటా డిజిటల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మొత్తం చిత్రాన్ని చిత్రీకరించారు. డిజిటల్ పాత్రలు, పరిసరాలు, భవనాలు, స్పెషల్ ఎఫెక్టులతో ఈ సినిమాని రూపొందించారు. ఇవన్నీ కంప్యూటర్ సృష్టించిన పాత్రలే. కాకపోతే నటులు లేకుండా సాధ్యం కాదు. ఈ సినిమా కోసం కంప్యూటర్ సహకారంతో 800 పాత్రలను సృష్టించారట. దీని కోసం వెల్లింగ్ టన్ సంస్థ 1,800కి పైగా స్టీరియోస్కోపిక్, ఫోటోరియలిస్టిక్ విజువల్ ఎఫెక్ట్స్ షాట్‌లను రూపొందించింది. ఎంత డిజిటల్ పాత్రలైనా హావభావాలు, భావోద్వేగాలు పండాలంటే వాస్తవ నటులు కూడా కావాలి. వారి నటనకు ఫేషియల్ మోషన్ క్యాప్చర్ విధానాన్ని జోడించారు. ఇదొక్కటే కాదు ఇంకా అనేక రకాల వినూత్న పద్దతుల్లో ఈ సినిమాని రూపొందించారు.
హై డెఫినిషన్ వీడియో కెమెరాతో దీని చిత్రీకరణ జరిపారు. నటుడి ముఖకవళికలను జోడించాలంటే ఇది చాలా అవసరం. వెటా డిజిటల్ సంస్థ స్వంతంగా డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్ దీనికి చాలా ఉపయోగపడింది. ముఖంలో ఏ కండరాలు కదులుతున్నాయో గుర్తించగలగడం ఇందులో కీలకం. వారి సాఫ్ట్‌వేర్ డేటాను ముఖ-యానిమేషన్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తారు. సెంట్రల్ వెల్లింగ్ టన్ కు 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోరువాలోనూ, స్టోన్ స్ట్రీట్ స్టూడియోస్‌లోనూ చిత్రీకరణ జరిపారు.స్క్రీన్ వెల్లింగ్‌టన్ ప్రొడక్షన్ చుట్టూ ఉన్న లాజిస్టిక్స్ ఈ సినిమా షూటింగ్ సక్రమంగా జరగడానికి ఉపయోగపడింది. ఇందులోని పాత్రలు ధరించిన దుస్తులు, ఆయుధాలు వంటి వాటి కోసం వెటా సంస్థ ఎంతో కసరత్తు చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైన మరిన్నో చిత్రాలు వస్తాయనడం అతిశయోక్తి కాదు. మిగతా సీక్వెల్స్ విడుదల ఎప్పుడో చూద్దాం.
అవతార్ రెండో భాగం రావడానికి 13 ఏళ్ల సమయం పట్టింది కానీ మిగతా భాగాలు రావడానికి అంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ భాగాల చిత్రీకరణ చాలావరకు పూర్తవడమే అందుకు కారణం. మొత్ం ఐదు భాగాలుగా ఈ అవాతార్ సిరీస్ చిత్రాలు ఉన్నాయి. ‘అవతార్-3’ 2024లో విడుదలవుతుందని జేమ్స్ కామెరాన్ వివరించారు.నాలుగో భాగం తాలూకు చిత్రీకరణ కూడా కొంత పూర్తయిందని ఆయన తెలిపారు. ఐదో భాగం గురించి అధికారికంగానే ప్రకటించానని, తనకు అవకాశమిస్తే అవతార్ 6, 7 భాగాల్ని కూడా తీస్తానంటున్నారు జేమ్స్ కామెరాన్. ఏది రావాలన్నా ఏది చేయాలన్నా ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలాంటి సినిమాలు రాబట్టే వసూళ్లు కూడా కీలకం. కాబట్టి ఆ మార్కెట్ ను బట్టే ఇలాంటి ఫ్రాంచైజీల మనుగడ ఉంటుంది.