వైఎస్ఆర్ సీపీకి గత ఐదేళ్ల కాలంలో అపారమైన నష్టం ఎందుకు జరిగిందో అధినేత జగన్ తెలుసుకున్నారో లేదో తెలీదు గానీ, ఆ పార్టీ అనుకూల పత్రిక మాత్రం ఆలస్యంగా గుర్తించింది. జగన్ ఓడిపోవడానికి కారణమైన బలమైన కారకాల్లో సోషల్ మీడియా విభాగం కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విభాగాధిపతిగా జగన్ రెడ్డి.. సజ్జల భార్గవ్ రెడ్డిని నియమించుకున్నారు. ఈయన జగన్ పార్టీలో నెంబర్ 2 అయిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి కుమారుడు. అన్ని విధాలా అర్హుడైన వారిని, సమర్థుడిని సోషల్ మీడియా ఇన్ ఛార్జిగా పెట్టుకోకుండా కేవలం కులం, రికమండేషన్ల ఆధారంగానే ఒక అసమర్థుడి చేతిలో జగన్ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు పెట్టారు. దీంతో మొదటికే మోసం వచ్చింది.
ఇప్పుడు ఈ విషయాన్ని జగన్ అనుకూల పత్రిక గ్రేట్ ఆంధ్రా గుర్తించి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో సజ్జల భార్గవ రెడ్డిని ఏకంగా శునకంతో పోల్చింది. సోషల్ మీడియా ఇన్ ఛార్జి పోస్టుకి జగన్ ఎంపిక చేసేవారు రెడ్డి కులస్థులు అయ్యుండాలని.. జగన్ ఫ్యామిలీకో లేదా కోటరీలోని నాయకులకూ బంధువయ్యుండాలని.. జగన్ కి పార్టీలోని నాయకులకి మధ్య అడ్డుగోడలా ఉండాలని.. సోషల్ మీడియా అద్భుతాలు చేస్తోందని జగన్ ని భ్రమలో ఉంచేవారినే జగన్ ఎంపిక చేస్తారని గ్రేట్ ఆంధ్రా ఎద్దేవా చేసింది. గత నాలుగేళ్ల నుంచి కనకపు సింహాసనం మీద ఒక శునకాన్ని జగన్ కూర్చోబెట్టారని.. సజ్జల భార్గవ్ ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించింది.
కార్యకర్తల్ని, నాయకుల్ని జగన్ కు దూరం చేసేలా సజ్జల, ఆయన తనయుడు భార్గవ చేశారు. జగన్ ని భ్రమల్లో తేలేలా చేసి.. తన తండ్రి అయిన సజ్జల పార్టీకి నెంబర్ 2 గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం సజ్జల భార్గవ్ చేశారు. నిజానికి భార్గవ్ సోషల్ మీడియా ఇంఛార్జి అయ్యే వరకు సజ్జల పార్టీలో నెంబర్ 2 అనే ప్రచారం లేదు. కొడుకు ఎంట్రీతోనే ఆ ప్రచారం ఎక్కువైంది. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. ప్రభ వెలిగేలా చేయమంటే తన సొంత ప్రభ, తండ్రి ప్రభ వెలిగేలా చూసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకునే కార్యక్రమాలే చేసాడని భార్గవ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
పైగా సజ్జల భార్గవ్ అన్ని వ్యాపారాల్లోనూ ఫెయిలైన ఒక నిరుద్యోగ యువకుడని.. అలాంటి అతణ్ని సోషల్ మీడియా ఇంఛార్జిని చేయడమే దరిద్రం అని గ్రేట్ ఆంధ్రా విశ్లేషించింది. అంతకుముందు వరకు ఆ వింగులో ఉన్న సమర్ధులని తీసిపారేశారు. నిజానికి ముందు దివ్యరెడ్డి అనే ఆవిడ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉండేది. ఆమె జగన్ మోహన్ రెడ్డికి మేనత్త కుమార్తె. అలాంటి ఆమెపైనే ఈ సజ్జల భార్గవ్ ను నియమించారు. అసమర్ధుడైన భార్గవ్ కి రిపోర్ట్ చేయాలని ఆమెకు సూచించారు. దీంతో అప్పుడే వైసీపీ సోషల్ మీడియా సగం నీరుగారిపోగా.. నాలుగేళ్లు పూర్తయ్యేనాటికి పార్టీ దారుణంగా పతనం అయిందని జగన్ అనుకూల పత్రిక విశ్లేషించింది.