సాధారణంగా రాజకీయ నాయకులు మీడియా మీద ఎంత అక్కసు ఉన్నప్పటికీ.. దాన్ని వెళ్లగక్కే తీరులో కాస్త సంయమనం పాటిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటినుంచి ‘ఆ రెండుపత్రికలు’ అని చెప్పుకుంటూ వచ్చినా, చంద్రబాబునాయుడు హయాంలో ‘అవినీతి పుత్రిక’ అంటూ అభివర్ణించినా.. జగన్మోహనరెడ్డి హయాం వచ్చిన తర్వాత.. ఫలానా పత్రికలకు కనీసం ప్రభుత్వ కార్యాలయాలనుంచి ‘విడుదల చేసే’ సమాచారం తప్ప, ‘అడిగే’ సమాచారం ఇవ్వరాదని అప్రకటిత హుకుం జారీ అయినా.. ప్రెస్ మీట్లలో వెటకారాలు పేలుతూనే ఉన్నా.. అన్నీ నర్మగర్భంగానే సాగిపోతుంటాయి. అయితే సోము వీర్రాజు కొత్త సారథి. ఇన్నాళ్లూ ఏదో తోచినప్పుడు.. నోటికి వచ్చిందల్లా తిట్టేయడమే తప్ప.. బాధ్యతతో మాట్లాడవలసిన అవసరం రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ రూపేణా బాధ్యత తనకు వచ్చినప్పుడు అలకపూనినట్లుగా.. ఎక్కువకాలం మౌనమే పాటించారు. ఇప్పుడు కోరుకున్న రాష్ట్రాధ్యక్ష పదవి వరించింది. అయితే.. అదుపులేని అదే తరహా మాట తీరు సాగుతోంది.
జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు గనుక.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనుక.. భాజపాకు రాష్ట్రంలో ఉన్నది ఒక్క శాతం ఓటు బ్యాంకు మాత్రమే అయినా.. ప్రజల దృష్టిలో విలువ లేకపోయినా.. మీడియా కాస్త పట్టించుకుంటుంది. అందుకే సోము వీర్రాజును కూడా అందరూ ఇంటర్వ్యూలు చేయడమూ జరిగింది. తొలి ఎటెంప్ట్ లోనే ఆయన టీవీ9 రజనీకాంత్ తో దాదాపు గొడవ పడ్డట్టుగా మాట్లాడేశారు. చివరికి ‘మీ పదవికి తగ్గ హుందాతనం అలవాటు చేసుకోండి’ అనే తరహాలో నీతులు చెప్పించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏకంగా బస్తీ మే సవాల్ అనేస్తున్నారు.
రాధాకృష్ణ ఈ ఆదివారం కొత్తపలుకు వ్యాసం రాశారు. రాజకీయాలను తన శైలిలో విశ్లేషిస్తూ జీవీఎల్ ప్రస్తావన కూడా తెచ్చారు. ‘మీ జీవీఎల్ మీ ఇష్టం’ అనేది ఆ ప్రస్తావనకు ఉపశీర్షిక. జీవీఎల్ వ్యవహార సరళి ప్రతిసారీ వివాదాస్పదంగానే ఉంటుంది.
ప్రజల్లోంచి గెలవగలిగిన నాయకుడు కాదు గనుక… ప్రజల్లోంచి గెలిచే ఆలోచన ఆయనకు కూడా లేదు గనుక.. పార్టీ భావజాలానికి భజన చేస్తూ ఉంటే చాలు.. పార్టీ బాగున్నంత కాలం తనను చల్లగా చూసుకుంటూ ఉంటుందనేది ఆయన భావన. అందుకే… ఆయన ఎప్పుడూ తన మాటల్లో తర్కం పట్టించుకోరు. ఇటీవలి కాలంలో ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కించిత్ ఇబ్బంది వచ్చినా.. తక్షణం మీడియా ముందుకు వచ్చి.. తనదైన విశ్లేషణలు అందిస్తున్నారు. (ఎదురింటి పాట పాడుతున్న బీజేపీ చిలకలు)
సుజనా తెలుగుదేశానికి మేలు చేస్తున్నట్టే, ఈ జాతీయ పార్టీనుంచి జీవీఎల్ వైకాపాకు కొమ్ము కాస్తున్నారు. ఈ జీవీఎల్ ధోరణిని ఆర్కే ఎత్తి చూపుతూ ‘మీ జీవీఎల్ మీ ఇష్టం’ అనే వ్యాసం రాశారు. దాంతో సోము వీర్రాజు గారికి కోపం తన్నుకొచ్చింది. ఆర్కే (రాధాకృష్ణ) బహిరంగంగా రాశారు గనుక.. తను కూడా ఒక బహిరంగలేఖ రాసేశారు. ఇంకా నయం.. ఆంధ్రజ్యోతికి దీటుగా కమలజ్యోతి అనే పత్రిక పెట్టదలచుకోలేదు!!
‘మీ సంపాదకీయం చదివాను’ అంటూ తన దండయాత్ర ప్రారంభించారు. నిజానికి అది సంపాదకీయం కాదు- వ్యాసం మాత్రమే. తన పత్రికలో కాలమిస్టుగా రాస్తున్నారు. పైగా రాధాకృష్ణను ‘సంపాదకులు’గా సంబోధించారు. ఆ పత్రికకు ఆయన మేనేజింగ్ డైరక్టర్ మాత్రమే. సంపాదకులు- కె.శ్రీనివాస్. ఇలా బేసిక్ నాలెడ్జి లేకుండ ఆయన లేఖను ప్రారంభించారు.
(ఆర్కే రాసిన కొత్తపలుకు వ్యాసంలో జీవీఎల్ గురించిన భాగం ఇక్కడ చదవండి)
లేఖ దిగువన సంతకం ఉన్నంత మాత్రాన ఆ లేఖను అచ్చంగా సోము వీర్రాజు రాశారని అనుకోడానికి వీల్లేదు. చిటికెవేస్తే రాసిపెట్టడానికి పార్టీ బృంద సభ్యులు బోలెడంత మంది ఉంటారు. అలాంటి వారిలోనైనా కాస్త పరిజ్ఞానం ఉన్నవారిని సోము వీర్రాజు ఎంచుకుని ఉండాల్సింది. ఆ పనిచేయలేదు. ఆ పాటి జ్ఞానం ప్రకారమే లేఖ మొత్తం సాగింది. రాసిన వారి జ్ఞానం ఎలాంటిదైనా, లోపాలున్నప్పుడు పోయేది తన పరువు గనుక.. సంతకం పెట్టేముందు సోము వీర్రాజు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఉండాలి. అది జరగలేదు.
ఆ లేఖలో రాధాకృష్ణ మీద వెటకారాలు, ఎత్తిపొడుపులు చాలానే ఉన్నాయి.రాధాకృష్ణ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారనే సంగతి ప్రత్యేకంగా ఇవాళ సోము వీర్రాజు కనుగొన్న సంగతి కాదు. ఆయన కొత్తగా ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. దాన్ని చాటడం వలన ఆయన కొత్తగా సాధించేది కూడా లేదు. కానీ జీవీఎల్ వైకాపాకు బాకాగా మారుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవడం ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయనే పార్టీకి సారథి. పార్టీ మునిగితే అందుకు ఆయనది కూడా బాధ్యతే అవుతుంది. ఆర్కే కు ఇచ్చిన కౌంటర్ చూస్తే.. జీవీఎల్ మీద వ్యాఖ్యలకు ఉడుక్కున్నట్టుగా అనిపించదు.. ఎప్పటినుంచో ఆర్కే మీద ఉన్న కోపాన్ని వెలిబుచ్చడానికి ఈ వ్యాసాన్ని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది.
జీవీఎల్‌ను చీమకుడితే నొప్పి సోము వీర్రాజుకు కలుగుతున్నట్లుగా ఈ లేఖ ఉంది. జీవీఎల్ తీరుపై ప్రజల్లో బోలెడన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం సోము వీర్రాజుకు ఎలాంటి కీర్తిని కట్టబెడుతుందో ఆయన తెలుసుకోవాలి. ‘‘నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి’’ అంటూ వీర్రాజు ఈసడించారు. పార్టీ అనేది పబ్లిక్ అయినప్పుడు.. అందులో అంతర్గత వ్యవహారాలేమిటో అర్థం కావడం లేదు. ఆర్కే రాసింది పార్టీ నాయకుల పడగ్గది వ్యవహారాలు, వంటింటి ముచ్చట్లు కాదు!
‘‘వ్యక్తుల ప్రయివేటు బతుకు
వారి వారి సొంతం
పబ్లిక్ లోకి వస్తే
ఏమైనా అంటాం’’
ఇది శ్రీశ్రీ మాట.
బహుశా ఈ ‘కాషాయ’దళపతికి- మహాకవి రాసిన ‘ఎర్ర’ కవిత్వం తెలియకపోవచ్చు. తెలిసిన ఆయన ఒప్పుకోకపోవచ్చు. కానీ జీవీఎల్ మాటలు మాత్రమే కాదు, సారథిగా ఆయన వ్యవహరించే ఇలాంటి దుడుకు పోకడలు కూడా పార్టీకి చేటు చేస్తాయని తెలుసుకోవాలి.
(సోము వీర్రాజు రాసిన లేఖ పూర్తిపాఠం ఇక్కడ చదవండి)